కనుల పండగగా డిజిటల్ మహానాడు

కనుల పండగగా డిజిటల్ మహానాడు

పసుపు పండుగ ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద పండుగలా భావించే మహానాడు ప్రారంభమైంది. టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబునాయుడు, పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. యనమల రామ కృష్ణుడు, చినరాజప్ప, అయ్యన్న పాత్రుడు, దేవినేని ఉమ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బోండా ఉమ, నారా లోకేష్ సహా పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలు, విదేశాల్లోని పార్టీ ఎన్ఆర్‌ఐ విభాగానికి చెందిన నాయకులు, కార్యకర్తలు జూమ్ యాప్ ద్వారా ఈ ప్రోగ్రామ్‌లో భాగస్వామ్యమయ్యారు. దాదాపు 14 వేల మంది డిజిటల్ మహానాడుకు హాజరయ్యారు. ఇన్ని వేలమందిని భాగస్వామ్యం చేస్తూ ఆన్‌లైన్‌లో ఇలాంటి కార్యక్రమం చేయడం దేశంలో ఇదే మొదటిసారి. టీడీపీ ఐదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ ‌అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని చంద్రబాబు గుర్తు చేశారు.

కార్యకర్తలే పార్టీకి బలం అని చంద్రబాబునాయుడు అన్నారు. కష్టకాలంలోనూ కార్యకర్తలే పార్టీ అండగా నిలబడ్డారని ప్రశంసించారు. పార్టీకి విధేయులుగా ఉన్న కార్యకర్తలకు కృతజ్ణతలు తెలిపిన చంద్రబాబు..వారికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. వైసీపీ ప్రభుత్వం మొదటి సంవత్సర పాలనలోనే రాష్ట్రంలో అవినీతి పెచ్చుమీరి పోయిందని ధ్వజమెత్తారు.

విశాఖ ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనపై చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. గ్యాస్ లీకేజీ ఘటనను వైసీపీ ప్రభుత్వం తేలిగ్గా తీసుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. స్టైరీన్ గ్యాస్ ప్రభావం ఎంత వరకు ఉంటుందో ప్రభుత్వం అంచనా వేయలేకపోతోందన్నారు.

అంతకుముందు, మహానాడులో కొన్ని తీర్మానాలు చేశారు. అసువులు బాసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలకు సం తాపం తెలుపుతూ తీర్మానం చేశారు. సీనియర్ నేత పంచుమర్తి అనూరాధ ఈ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. LG పాలిమర్స్ దుర్ఘటనపై మహానాడు తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. మృతులకు నివాళిగా 2 నిమిషాలు మౌనం పాటించారు. సీనియర్ నాయకుడు గణబాబు LG పాలిమర్స్ దుర్ఘటనపై తీర్మానం ప్రవేశపెట్టారు.

Tags

Read MoreRead Less
Next Story