తెలంగాణలో మరిన్ని సడలింపులు.. కర్ఫ్యూ నుంచి వీటికి మినహాయింపు

తెలంగాణలో మరిన్ని సడలింపులు.. కర్ఫ్యూ నుంచి వీటికి మినహాయింపు

కరోనా కట్టడితోపాటు అనేక అంశాలపై ప్రగతి భవన్‌ వేదికగా సీఎం కేసీఆర్‌ సంబంధిత శాఖ మంత్రులు, ఉన్నతాధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు.. ఓ వైపు కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను వివరిస్తూనే మరిన్ని సడలింపులకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. జిల్లాల నుంచి వచ్చే బస్సులు జేబీఎస్‌తోపాటు ఇమ్లీబన్‌లో కూడా ఆగేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా బస్సు సర్వీసులు పునరుద్ధరించిన తర్వాత పరిస్థితిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రోజుకు 11 నుంచి 12 కోట్ల రూపాయల ఆదాయం రావాల్సి ఉండగా.. ప్రస్తుతం రెండు కోట్ల రూపాయలు మాత్రమే వస్తోందన్నారు. రాత్రి పూట విధిస్తున్న కర్ఫ్యూ కారణంగా ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు రాత్రి ఏడు గంటల లోపు గమ్యస్థానాలకు చేరుకోవడం సాధ్యం కావడం లేదన్నారు. వేసవి కావడంతో ప్రజలు ఉదయం లేదంటే సాయంత్రం సమయంలోనే ప్రయాణం చేయడానికి మొగ్గు చూపుతున్నారన్నారు. పగటిపూట మాత్రమే బస్సులు నడపడం వల్ల ప్రయోజనం లేదన్నారు.. ఈ నేపథ్యంలో పలు కీలక సూచనలు చేశారు సీఎం కేసీఆర్‌. కర్ఫ్యూ సమయంలో కూడా ఆర్టీసీ బస్సులు గమ్యస్థానం చేరడానికి అవకాశం ఇస్తారన్నారు. బస్టాండ్లలో ట్యాక్సీలు, ఆటోలు సహా ఇతర రవాణా వాహనాలకు అనుమతి ఇవ్వాలన్నారు. బస్‌ టికెట్‌ కలిగిన ప్రయాణికులు కర్ఫ్యూ సమయంలో కూడా ప్రైవేటు వాహనాల్లో తమ ఇళ్లకు చేరుకోవడానికి పోలీసులు అభ్యంతర పెట్టరని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఇక హైదరాబాద్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మరికొద్ది రోజుల వరకు నగరంలో సిటీ బస్సులు నడవవని చెప్పారు. అటు అంతర్‌ రాష్ట్ర బస్సులను కూడా మరికొన్ని రోజులు నడపకూడదన్నారు.

ఇక హైదరాబాద్ నగరంలో మాల్స్ మినహా అన్ని రకాల షాపులు తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం నగరంలో ఒక షాపు తప్పించి మరో షాపు తెరిచే వెసులుబాటు కల్పించింది. దీనివల్ల ఒకే షాపులో ఎక్కువ మంది గుమిగూడే ప్రమాదం ఏర్పడుతున్నది. ఎక్కువ షాపులు తెరిచి, తక్కువ మంది పోగయ్యే విధానం అనుసరించాలని నిర్ణయించింది. షాపుల యజమానులు, వినియోగదారులు కోవిడ్ నిబంధనలు పాటించాలని ప్రభుత్వం సూచించింది.

Tags

Read MoreRead Less
Next Story