భారత్‌లో చైనాను మించిన కరోనా మరణాలు.. గడిచిన 24 గంటల్లో..

భారత్‌లో చైనాను మించిన కరోనా మరణాలు.. గడిచిన 24 గంటల్లో..

కరోనా ధాటికి దేశం అల్లాడుతోంది... గత 24 గంటల్లో... 7 వేల 466 కొత్త కేసులు నమోదవగా... 175 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాలు.. దాదాపు 5 వేలకు చేరుకున్నాయి. చైనాలో ఇప్పటి వరకు 4 వేల 634 మరణాలు సంభవించగా.. ఆ సంఖ్యను మనం దాటడం ఆందోళన కలిగిస్తోంది. పాజిటివ్‌ కేసుల నమోదులో 9 వ స్థానానికి చేరుకోగా... మరణాల్లో 13వ స్థానంలో ఉంది. మహారాష్ట్రలో గత 24 గంటల్లో కరోనాతో 116 మంది చనిపోయారు. ఇప్పటి వరకు ఒక్క రోజులో ఇవే అత్యధిక మరణాలు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 2 వేలు దాటింది. కొత్తగా 2 వేల 682 కేసులు నమోదు కాగా... మొత్తం కేసులు 62 వేలు దాటాయి. గత 24 గంటల్లో 116 మంది పోలీసు సిబ్బంది కరోనా బారినపడ్డారు. దీంతో మహారాష్ట్ర పోలీసు శాఖలో కరోనా బారినపడ్డవారి సంఖ్య 2 వేల 2 వందలు దాటింది. వీరిలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. స్లమ్ ఏరియా ధారావిలో కొత్తగా 41 కేసులు వెలుగు చూడగా... మొత్తం కేసులు 17 వందల 15కి చేరాయి. ఇప్పటి వరకు ఒక్క ధారావి ప్రాంతంలో 70 మంది చనిపోయారు.

దేశంలోని కరోనా రికవరీ రేటు 42.89 శాతంగా ఉందని కేంద్రం ప్రకటించింది. ఈ నెల 20 వరకు 279 శ్రామిక్ ప్రత్యేకరైళ్లను నడిపినట్టు.. రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. వాటి ద్వారా 3 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చామన్నారు. వారిలో ఎక్కువ మంది యూపీ, బిహార్ రాష్ట్రాలకు చెందినవారే. మరోవైపు లాక్‌డౌన్‌ నేపథ్యంలో 27 లక్షల మంది వలస కూలీలు యూపీ చేరుకున్నట్టు ఆ రాష్ట్రం తెలిపింది.

లాక్‌డౌన్‌ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని వెనక్కి తెచ్చే వందే భారత్ మిషన్‌ రెండో విడత కొనసాగుతోంది. తాజాగా ఈ మిషన్‌లో అదనపు విమానాలు జోడించారు. జూన్‌ 4న ఢిల్లీ నుంచి ఆక్లాండ్‌, జూన్‌ 5న ఢిల్లీ-షికాగో, స్టాక్‌హోమ్‌, జూన్‌ 6న ఢిల్లీ నుంచి న్యూయార్క్‌- ఫ్రాంక్‌ఫర్ట్‌, సియోల్‌, జూన్‌ 6న ముంబయి నుంచి లండన్‌, న్యూయార్క్‌ మధ్య సర్వీసులు నడపనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story