జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ అసలు ఉద్దేశం ఏంటి?

జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ అసలు ఉద్దేశం ఏంటి?

ఏపీలో విశాఖ కేంద్రంగా సినీపరిశ్రమ అభివృద్ధి చెందనుందా? వైజాగ్‌లో భూములకు క్లాప్‌ ఇచ్చినట్లేనా? తెలుగు సినీ ప్రముఖులతో సీఎం జగన్ సమావేశంలో ఇదే అంశంపై ప్రధానంగా చర్చజరిగిందా? సినిమా షూటింగ్‌లకు అనుమతి కోసమే సీఎం జగన్‌ కలిశామని పైకి చెబుతున్నప్పటికీ.. ఏపీలో ఫిల్మ్‌ ఇండస్ట్రీ విస్తరణపైనే ఎక్కువగా ఫోకస్‌ చేశారన్న చర్చ విస్తృతంగా జరుగుతోంది. వైజాగ్‌లో స్టూడియోల నిర్మాణానికి, అక్కడ స్థిరపడాలకునే వారికి భూములు కేటాయిస్తామని సీఎం జగన్‌ ప్రకటించడం కూడా ఈ వాదనకు మరింత బలం చేకూరుస్తోంది. ఓవైపు అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ.. 176 రోజులుగా రైతులు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఈ ఆందోళనను ఏమాత్రం పట్టించుకోని ప్రభుత్వం.. విశాఖ కేంద్రంగానే అన్ని పనులను చక్కబెట్టేస్తోంది. విశాఖలోలో సినీ వికాసం కూడా ఇందులో భాగమేనన్న విమర్శలున్నాయి. సీఎం జగన్‌ను కలవడం ద్వారా సినీపెద్దలకు స్వామికార్యం స్వకార్యం రెండూ సిద్ధించాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సినీ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, డి.సురేష్‌బాబు, రాజమౌళి, దిల్‌ రాజు, పొట్లూరి వరప్రసాద్‌, సి.కళ్యాణ్‌, తదితరులు మంగళవారం ముఖ్యమంత్రిని క్యాంపు కార్యాలయంలో కలిశారు. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ అమలుతో థియేటర్లు మూతపడటం, షూటింగులు ఆగిపోవడంతో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను వివరించారు. వాటి పరిష్కారానికి సహకరించాలని కోరారు. లాక్‌డౌన్‌లో థియేటర్లు మూతపడినందున వాటి నుంచి వసూలు చేస్తున్న కనీస స్థిర విద్యుత్‌ ఛార్జీలను రద్దు చేయాలని, నంది అవార్డుల బహూకరణ ఉత్సవాలను పునరుద్ధరించాలని కోరారు. జులై 15 నుంచి ఏపీలో సినిమా చిత్రీకరణలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

విశాఖకు సినీపరిశ్రమ రావడం వెనుక ప్రభుత్వ వ్యూహం ఉందని విమర్శిస్తున్నాయి విపక్షాలు.. 176 రోజులుగా రైతులు ఉద్యమిస్తుంటే స్పందించాల్సిన బాధ్యత సినీపెద్దలకు లేదా అని బీజేపీ ఏపీ ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story