సమావేశాలు బడ్జెట్ కోసమా? సీఆర్డీఏ చట్టం రద్దు కోసమా?: చంద్రబాబు

సమావేశాలు బడ్జెట్ కోసమా? సీఆర్డీఏ చట్టం రద్దు కోసమా?: చంద్రబాబు

అబద్ధాలు, అవినీతి, అరాచకాల్లో వైసీపీ ఆరితేరిందని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. బయట ప్రజల పౌరహక్కులను కాలరాస్తున్నారని.. సభ లోపల ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాలు బడ్జెట్ కోసం పెట్టారా.. లేక పరిపాలన వికేంద్రీకరణ, CRDA చట్టం రద్దు బిల్లుల కోసం పెట్టారా అని నిలదీశారు. ఇప్పటికే సెలక్ట్‌ కమిటీకి పంపిన బిల్లులను మళ్లీ దొడ్డిదారిన తీసుకొచ్చారని విమర్శించారు. రూల్ 90 కింద చర్చించాలని కోరితే దాడులకు దిగుతారా అని మండిపడ్డారు. అడ్వకేట్ జనరల్ హైకోర్టులో వేసిన అఫిడవిట్‌లో వికేంద్రీకరణ, CRDA బిల్లులు సెలెక్ట్ కమిటీ ముందున్నాయని స్పష్టంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ అవే బిల్లులను ఎలా తెస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు అధ్యక్షతన ఆన్లైన్ లో టీడీపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది.

ద్రవ్య వినిమయ బిల్లును ఎవరు ఆపారు? ఆమోదం పొందకుండా ఎవరు అడ్డుపడ్డారో.. కౌన్సిల్ సమావేశాల వీడియోలు, రికార్డులు చూస్తే బయటపడుతుందన్నారు చంద్రబాబు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, సీఎం జగన్ బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. రెండు మూడు వారాలు జరగాల్సిన బడ్జెట్ సమావేశాలను 2రోజుల్లో ముగించారని అన్నారు. శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీల పోరాటం చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుందన్నారు. మంత్రుల దాడులను తట్టుకుని నిలబడిన తీరు అభినందనీయమన్నారు చంద్రబాబు.. అనారోగ్యం, వృద్ధాప్యం లెక్కచేయకుండా ఎమ్మెల్సీలు సభకు హాజరయ్యారని చెప్పారు..ఇదే పోరాట స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తూ.. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని అన్నారు చంద్రబాబు. వైసీపీ ప్రలోభాలకు లొంగిన కొందరు చరిత్రహీనులుగా మిగిలిపోయారని చెప్పారు.

దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్న చైనా తీరుని తెలుగుదేశం శాసనసభా పక్షం ఖండించింది. దేశ రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు సంఘీభావం ప్రకటించింది. ప్రాణత్యాగం చేసిన 20మంది సైనికులు, అమరుడైన తెలుగుబిడ్డ కల్నల్ సంతోష్ బాబుకు జోహార్లు అర్పించారు.

Tags

Read MoreRead Less
Next Story