ఒక సామాజిక వర్గాన్ని తొక్కేయాలని అనుకోవడం భ్రమ : ఎంపీ సుజనా చౌదరి

ఒక సామాజిక వర్గాన్ని తొక్కేయాలని అనుకోవడం భ్రమ : ఎంపీ సుజనా చౌదరి

నిమ్మగడ్డ, కామినేనితో భేటీకి సంబంధించి..... స్పష్టత నిచ్చారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. ఈ నెల 13న తాను నిమ్మగడ్డ, కామినేనితో రహస్యంగా సమావేశమైనట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు సుజనాచౌదరి. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్న చందంగా వైసీపీ నేతలు వ్యాఖ్యానాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు...

లాక్ డౌన్ తరువాత తన అధికార, వ్యాపార కార్యకలాపాలను బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అక్కడే వివిధ రంగాలకు చెందిన అనేకమంది వ్యక్తులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు తనను కలుస్తున్నట్లు వెల్లడించారు. తన కార్యకలాపాలను, సమావేశాలను రహస్యంగా నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు సుజనా చౌదరి. ఈ ప్రభుత్వం అవసరమైతే.. రాజ్‌భవన్‌పైనా నిఘా పెట్టినట్లు కనిపిస్తోందన్నారు.

ఓ సామాజిక వర్గాన్ని తొక్కేద్దామని అనుకోవడం సీఎం జగన్‌ భ్రమ అన్నారు. ఈ జాతీ సత్తా కొన్ని దశాబ్దాలుగా రాష్ట్ర ప్రజలు చూస్తున్నే ఉన్నారన్నారు. అర్హత లేని వందల మంది సీఎం తన సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించుకోలేదా అని ప్రశ్నించారు.

ఇక నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌తో రెండు తరాలుగా బంధుత్వం ఉందన్నారు. నిమ్మగడ్డను కలిశామని, ఇందులో ఎలాంటి రహస్యం లేదన్నారు. కనకరాజును విజయసాయిరెడ్డి కలవలేదా ? అని ప్రశ్నించారు.

ఏడాది పాలనలో జగన్‌ సర్కారులో అక్రమాలు, అవినీతిపై సీబీఐ దృష్టిపెట్టిందన్నారు. ఈ విషయంలో కేంద్రం ఎప్పటికప్పుడు మానిటరింగ్‌ చేస్తున్నట్లు తెలిపారు. మొత్తానికి నిమ్మగడ్డ, కామినేనిలతో భేటీ, పార్క్‌ హయత్‌ హోట్‌ల్‌ సీసీటీవీ దృశ్యాలపై స్పష్టత నిచ్చారు సుజనాచౌదరి.

Tags

Read MoreRead Less
Next Story