45 ఏళ్ల తర్వాత ఏపీలోనూ అలాంటి అరాచక పాలనే..

45 ఏళ్ల తర్వాత ఏపీలోనూ అలాంటి అరాచక పాలనే..

జూన్ 25, 1975... సరిగ్గా 45 ఏళ్ల క్రితం దేశంలో ఎమర్జెన్సీ అమలులోకి వచ్చిన రోజు. భారతదేశ చరిత్రలోనే ఓ మచ్చలాగా మిగిలిన చికటి రోజులవి. నిరంకుశ పాలన, ప్రశ్నించిన వాళ్లని, ఎదరించినవాళ్లని కర్కషంగా జైలుపాలు చేసిన ఘటనలు కోకల్లలు. సరిగ్గా ఇప్పుడు 45 ఏళ్ల తర్వాత ఏపీలోనూ అలాంటి అరాచక పాలనే పునావృతం అవుతోందని ఆరోపిస్తోంది టీడీపీ. నిరంకుశ ధోరణి, అంతా నేనే..అంతా నాదే అన్నట్లుగా జగన్ ప్రభుత్వం అణిచివేత విధానాలతో ప్రజాస్వామ్యం మౌళిక సూత్రాలు కూడా కాలరాస్తోందని మండిపడుతున్నారు. సరిగ్గా గతేడాది ఇదే రోజున ప్రజావేదికను కూల్చి వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన తెరతీసింది. అయితే..ప్రజావేదికను కూల్చి ఏడాది కావటంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లారు టీడీపీ నేతలు. కానీ, ఉండవల్లి కరకట్ట దగ్గరకు చేరుకోగానే తెలుగుదేశం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఎవరినీ అనుమతించేది లేదంటూ ఆపేశారు. ఎక్కడిక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. మిగిలిన వాహనాలను వెళ్లనిచ్చిన టీడీపీ నేతల వాహనాలను మాత్రం నిలిపివేశారు. దీంతో పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడ్డారు.

కాసేపటికే పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు టీడీపీ నేతలను అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రజావేదిక కూల్చిన ప్రాంతానికి వెళ్తుంటే ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం పెడుతోందని టీడీపీ ప్రశ్నించారు. చంద్రబాబు నివాసానికి వెళ్లడం, ప్రజావేదిక కూల్చివేత ప్రాంతాన్ని పరిశీలించడం ఏ చట్టం కింద తప్పు అవుతుందో పోలీసులు చెప్పాలని TDP నేతలు డిమాండ్ చేశారు.

చంద్రబాబు నివాసంలో కృష్ణా, గుంటూరు జిల్లాల నేతల సమావేశానికి వెళ్లేందుకే తాము వచ్చామని.. ప్రభుత్వం ఇలా అక్రమంగా ఆంక్షలు పెట్టడం సరికాదని అన్నారు మాజీ మంత్రి దేవినేని ఉమ. రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతోందని, పోలీసులు ఎవరి డైరెక్షన్‌లోనో పనిచేయడం సరికాదని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలులో ఉందని మండిపడ్డారు టీడీపీ నేత వర్ల రామయ్య. సరిగ్గా 45 ఏళ్ల క్రితం ఇదే రోజున ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించి నీతి, నిజాయితీ నేతలుగా పేరున్నవారిని కూడా అరెస్ట్ చేయించారని గుర్తుచేశారు.

తమ పార్టీ అధినేత ఇంటికి వెళ్లే స్వేచ్ఛ కూడా టీడీపీకి లేదా? అని ప్రశ్నించారు యనమల. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఫాసిజంలో ఉన్నామా? అని ప్రశ్నించారు. పార్టీ అధినేత ఇంట్లో సమావేశం అయ్యేందుకు వెళ్తున్న వారిని కూడా అరెస్ట్ చేయటం అరాచక పాలనకు నిదర్శనమని అన్నారాయన.

మరోవైపు ప్రజావేదికను కూల్చివేసి ఏడాదవటంతో..జగన్ ప్రభుత్వ విధానాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. ఏడాది కిందటే విధ్వంసం దిశగా తొలి బీజం పడిందన్నారు. అన్ని వ్యవస్థల్ని, సంస్థల్ని ధ్వంసం చేస్తూ పాలన సాగడం దారుణమన్నారు. అటు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కూడా YCP పాలనపై మండిపడ్డారు. కూల్చడం చిటికలో పని, ఒక భవనం కట్టడం ఎంతో కష్టం.. ఇది తెలిసి కూడా జగన్‌ విధ్వంసానికే జైకొడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు నవ్యాంధ్ర నిర్మాత అయితే.. జగన్ నవ్యాంధ్ర నాశనానికి కంకణం కట్టుకున్న అరాచక పాలకుడని అన్నారు. ప్రజావేదిక శిధిలాలే ఇందుకు సాక్ష్యమన్నారు. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి, నిర్మించి, ప్రజల సమస్యల పరిష్కారం కోసం వేదిక కడితే.. ఒక్క రాత్రిలో జగన్ దాన్ని కూల్చేశారన్నారు. ప్రజావేదిక కూల్చిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్తున్న TDP నేతల్ని అడ్డుకోవడాన్ని ఖండించారు.

Tags

Read MoreRead Less
Next Story