భారత్‌పై నేపాల్ ప్రధాని తీవ్ర ఆరోపణలు..

భారత్‌పై నేపాల్ ప్రధాని తీవ్ర ఆరోపణలు..

గత కొన్ని రోజుల నుంచి నేపాల్ .. భారత్‌తో కవ్వింపు చర్యలకు దిగుతుంది. తాజాగా ఆ దేశ ప్రధాని కేపీ ఓలీ శర్మ.. భారత్ పై మరోసారి పసలేని ఆరోపణలు చేశారు. తనను ప్రధాని పదవి నుంచి తొలగించడానికి భారత్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఖాట్మండ్ లోని భారత రాయబారి కార్యాలయం ఈ కుట్రలకు వేదిక అవుతుందని ఓలీ అన్నారు. అయితే, భారత్ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. నన్ను ఏం చేయలేదని ఆయన సవాల్ విసిరారు. నేపాల్ కొత్త మ్యాప్ కు రాజ్యాంగ సవరణ జరిగినప్పటి నుంచి ఈ కుట్ర జరుగుతోందని.. కానీ, నేపాల్ జాతీయత బలమైనదని.. మ్యాప్ ను ముద్రించినంత మాత్రాన నేపాల్ ప్రజలు తనను ప్రధాని పదవి నుంచి తొలగించాలని కోరుకుంటారని తాను బావించడం లేదని అన్నారు. అయితే, ఓలీని రాజీనామా చేయాలని సొంత పార్టీ నేతలే గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఓలీ సమర్థవంతమైన నాయకుడు కాదని.. ఆయన రాజీనామా చేయాలని మాజీ ప్రధాని ప్రచండ డిమాండ్ చేస్తున్నారు.

కాగా, ఉత్తరాఖండ్ భూభాగాలు అయిన లిపులేఖ్, కలాపాని, లింపియాధురా ప్రాంతాలను తమవిగా చూపిస్తూ తయారు చేసిన కొత్త మ్యాప్ కు నేపాల్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన భారత్.. నేపాల్ ఇలాంటి చర్యలు మానుకోవాలని హెచ్చరించింది. ఈ మూడు ప్రాంతాలు భారత్ లో అంతర్భాగమని స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story