గుండెలవిసే మహా విషాదం.. 350 ఏనుగుల మృతి

గుండెలవిసే మహా విషాదం.. 350 ఏనుగుల మృతి

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 350 గజరాజులు ప్రాణాలు గాల్లో కలిశాయి. గుండెలవిసిపోయే ఈ మహా విషాద సంఘటన దక్షిణాఫ్రికాలోని బొస్ట్వానాలో వెలుగులకి వచ్చింది. ఇన్ని ఏనుగులు ఎలా చనిపోయాయనే విషయం రెండు నెలల నుంచి అంతు చిక్కడం లేదు. మహా మహా పశువైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు గజరాజుల మరణాలకు కారణాలు కనుక్కోలేకపోతున్నారు. బొస్ట్వానాకు కొన్ని మైళ్ళ దూరంలో ఒకావాంగో డెల్టా ఉంది. ఇక్కడ చీమలు దూరని చిట్టడివి కాకపోయినా మోస్తరు అడవి ఉంది. ఈ అడవిలో ఎక్కువగా ఏనుగులు సంచరిస్తుంటాయి. స్థానిక గిరిజనులు అడవికి వెళ్లి వంటచెరకు కొట్టుకొని పక్కనే ఉండే పట్టణంలో అమ్ముతుండేవారు. అయితే వారికి గత కొద్దిరోజులుగా ఏనుగుల కళేబరాలు పెద్దఎత్తున కనిపించాయి. దాంతో అటవీ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు శాటిలైట్ సహాయంతో మే నెల నుంచి ఫోటోలు తీస్తున్నారు. ఈ ఫొటోల్లో ఎక్కడ చూసినా గజరాజుల కళేబరాలు కనిపిస్థున్నాయి. ఒక్క మే నెలలోనే 200 కు పైగా ఏనుగులు మృత్యువాత పడ్డాయి.

చనిపోయి ఉన్న ఏనుగు కళేబరాల్లో ఉన్న లక్షణాలు మిగతా జంతువుల్లో మాత్రం కనిపించలేదు. అంతేకాదు అదే ఏరియాలోని మరికొన్ని బ్రతికున్న ఏనుగులు నీరసంగా కనిపించాయని, చుట్టూ గిరగిర తిరుగుతున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. 2018 లో బోట్స్వానాలో 90 ఏనుగుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇందులో చాలా వరకు కళేబరాలు దంతాలు లేకుండా ఉన్నాయి. అంటే దీన్ని బట్టి చూస్తే దంతాల కోసం స్మగ్లర్లు అప్పట్లో ఏనుగులను చంపి ఉంటారన్న నిర్ధారణకు వచ్చారు అధికారులు. అయితే ఇటీవల మరణించిన ఏనుగుల మృతదేహాలు మాత్రం ఆ తరహాలో లేవని అంటున్నారు. బ్యాక్టీరియా-వైరస్ సోకి వాటి మానసిక స్థితి క్షీణించి ఉండొచ్చని లేదా ఏనుగుల మీద పెద్దఎత్తున విషం ప్రయోగం జరిగి ఉండొచ్చని.. అందువల్లే ఏనుగులు మృతిచెందాయని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా గజరాజుల మృతికి కారణాలు తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story