ఫుట్‌పాత్‌ పైనే జీవితం.. పదిలో 68 శాతం మార్కులు సాధించడంతో..

ఫుట్‌పాత్‌ పైనే జీవితం.. పదిలో 68 శాతం మార్కులు సాధించడంతో..

తాను ఉన్న పరిస్థితిని నిందించలేదు.. అమ్మానాన్నని అది కావాలి, ఇది కావాలి అని అడగలేదు.. బాగా చదువుకోవాలన్న ఆశయమే తన కళ్లముందు కనపడింది. పది పరీక్షల్లో 68 శాతం మార్కులు సాధించి మున్పిపల్ అధికారుల మన్నలను పొందింది. ఆ చదువుల తల్లికి బహుమానంగా సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఇచ్చి అండగా నిలబడ్డారు అధికారులు.

ఇండోర్ లోని ఒక మార్కెట్ లో ఫుట్ పాత్ ముందు ఉన్న గుడిసెలో వారి నివాసం. రోడ్డు విస్తరణలో భాగంగా అక్కడి గుడిసెలు కూల్చివేయడంతో ఫుట్ పాత్ మీదే ముగ్గురు పిల్లలను పెట్టుకుని బతుకు వెళ్లదీస్తున్నారు భారతి ఖండేకర్ తల్లిదండ్రులు. తండ్రి రోజువారీ కూలిపనికి వెళితే తల్లి ఓ పాఠశాలలో స్వీపర్ గా పని చేస్తోంది. భారతికి ఇద్దరు తమ్ముళ్లు. తండ్రికి పిల్లలను చదివించాలన్న ఆశ.. భారతికి బాగా చదువుకోవాలన్న కోరిక.. ఉండడంతో పగలు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లొచ్చి తన తమ్ముళ్లను చూసుకుంటూ రాత్రి పూట ఒంటి గంట వరకు చదువుకునేది. పదవతరగతి పరీక్షల్లో 68 శాతం మార్కులు సాధించింది. పాఠశాల యాజమాన్యం భారతిని గురించి ప్రభుత్వ అధికారులకు విన్నవించారు.

ఉన్నతాధికారులు భారతి తెలివితేటలకు మెచ్చి, ఆమె కుటుంబ పరిస్థితిని మెరుగుపరచదలిచారు. ఇల్లు లేని భారతి కుటుంబానికి ఇంటిని బహుమతిగా ఇవ్వాలనుకున్నారు. ఐఎఎస్ కావాలనుకుంటున్న భారతికి ఆర్థికంగా అండగా నిలబడతామన్నారు. పై చదువులకు కావలసిన వనరులు సమకూర్చుతామని భరోసా ఇచ్చారు. దాంతో సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ను బహుమతిగా ఇచ్చారు. చదువుకోవడానికి టేబుల్, కుర్చీ,పుస్తకాలు, బట్టలు అందించామని ఇండోర్ లోని ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజనకు చెందిన ప్రశాంత్ దిఘే అన్నారు.

తన పై చదువులకు అండగా నిలబడతామన్న అధికారులకు భారతి కృతజ్ఞతలు తెలియజేసింది. భారతి తల్లి మాట్లాడుతూ.. నా కుమార్తె పదవతరగతిలో ఉత్తీర్ణురాలైనందుకు సంతోషంగా ఉందని చెప్పింది. ఇల్లు లేని మాకు ఇల్లు సమకూర్చి పెట్టింది. నా భర్త, నేను నిరక్షరాస్యులం. అయినా మా బిడ్డ బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుంది. మా జీవితాలు నిలబెట్టింది. నా పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. నాకు నెలకు రూ.2 వేలు జీతం వస్తుంది అని ఆమె చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story