ఆమెతో పరిచయం.. ఆయన రూ.11లక్షలు గోవింద..

ఆమెతో పరిచయం.. ఆయన రూ.11లక్షలు గోవింద..

అతనో రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఓ మహిళ ఫోన్ చేసి అందంగా మాట్లాడింది. అన్నీ అడిగి తెలుసుకుంది. అతడి రూ.11లక్షలు పోయాక కాని ఆమె మోసం చేసిందని తెలుసుకున్నాడు. నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన నాగిళ్ల లక్ష్మణ్ రావు రియల్ ఎస్టేట్ వ్యాపారిగా పని చేస్తున్నాడు. గత జనవరిలో ఆయనకు ఓ మహిళ ఫోన్ చేసి తన పేరు తామరా బెన్ సెట్టి అని, లండన్ లోని హెచ్ఎస్బీసీ బ్యాంకులో విదేశీ వ్యవహారాల శాఖలో పని చేస్తున్నానని పరిచయం చేసుకుంది. లక్ష్మణ్ రావు కుటుంబం గురించి వివరాలు తెలుసుకుని తరచూ అతడితో చాటింగ్ చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో తాను పని చేస్తున్న బ్యాంకులో ఖాతా ఉన్న ఓ వ్యక్తి మరణించారని, అతడి ఖాతాలో 9,600 మిలియన్ డాలర్లు ఉన్నాయని, వాటిని డ్రా చేసుకోవడానికి సహకరించమని కోరింది.

ఇందుకోసం బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడానికి రూ.96 వేలు (1,350 యూఎస్ డాలర్లు) వేయమని కోరింది. అలా ఒకసారి డబ్బు పంపించడంతో ఇదే అలుసుగా తీసుకుని తరచూ ఏదో ఒక కారణం చెప్పి ఇప్పటికి ఆరుసార్లు తన ఖాతాలో రూ.7.83 లక్షలు జమ చేయించుకుంది. అదే విధంగా మరో ఇద్దరు మహిళలు డబ్బులు పంపమనడంతో వారికీ రూ.3,13,600 ఖాతాలో వేశాడు. తర్వాత మళ్లీ వాళ్ల దగ్గర నుంచి ఫోన్ లేదు. ఇతను వాళ్లకి చేస్తుంటే ఫోన్ స్విచ్ఛాఫ్ అని వస్తుంది. దాంతో మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు.

Tags

Read MoreRead Less
Next Story