మనోధైర్యమే మంచి మందు.. కరోనాను జయించిన నాయకులు..

మనోధైర్యమే మంచి మందు.. కరోనాను జయించిన నాయకులు..

కరోనా వచ్చిందని కంగారు పడకుండా వైద్యుల సూచనలు పాటిస్తూ, మనో ధైర్యంతో ఉంటే వైరస్ ని అంతమొందించొచ్చని కొవిడ్ బారిన పడి కోలుకున్న రాజకీయ నాయకులు చెబుతున్నారు. లేచిన దగ్గర నుంచి సభలు, సమావేశాలు అంటూ నలుగురిలో తిరాగాల్సిన పరిస్థితి నాయకులది. ఈ నేపథ్యంలో కొవిడ్ వచ్చిన వారెవరో అంచనా వేయడం కష్టం. అలాంటి పరిస్థితిలోనే కరోనా బారిన పడ్డారు నాయకులు కొందరు. వారు హోం మంత్రి మహమూద్ అలీ, జనగామ నియోజకవర్గ శాసన సభ్యులు గణేశ్ బిగాల, బాజిరెడ్డి గోవర్ధన్, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలు వీహెచ్, గూడూరు నారాయణరెడ్డి కొవిడ్ కు చికిత్స తీసుకుని కోలుకున్నారు. మహమ్మారి నుంచి బయటపడిన విధానాన్ని వివరించారు. మనోనిబ్బరమే ఆలంబనగా మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటే వైరస్ ను పారదోలవచ్చని తెలిపారు.

హోం మంత్రి మహమూద్ అలీ కరోనా నుంచి కోలుకున్న విధానాన్ని వివరించారు. లక్షణాలు కనిపించిన వెంటనే టెస్ట్ చేయించుకున్నాను పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నాను. వారిచ్చిన మందులు, విటమిన్ టాబ్లెట్లతో పాటు వేడినీళ్లు, తులసి నీళ్లు కూడా తాగడం చేశాను. కరోనా విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. చల్లని నీరు తాగవద్దు. ఇంటి భోజనం మాత్రమే చేయాలి అని చెప్పారు.

నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్.. కరోనా గురించి మొదటి నుంచి జాగ్రత్తగానే ఉన్నా నాకూ సోకింది. లక్షణాలు కనిపించిన వెంటనే ఆస్పత్రికి వెళ్లాను. వైద్యులు ఇచ్చిన మందులతో పాటు.. ఇంటి పద్దతులు పాటించాను. వేడినీళ్లు తాగడం, ఆవిరి పట్టడం లాంటివి చేశాను. కరోనా విషయంలో విటమిన్ డి పాత్ర ప్రముఖమైంది. కరోనాను ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దు. స్నేహితుడైనా, బంధువైనా రెండు మీటర్ల దూరంలో ఉండాలి. ఉదయం పూట ఎండలో కొద్ది సేపు నిలబడాలి. కోలుకుని ఇంటికి రావడం సంతోషంగా ఉందని అన్నారు.

నిజామాబాద్ నగర ఎమ్మెల్యే గణేశ్ గుప్తా బిగాల మాట్లాడుతూ బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డికి పాజిటివ్ రావడంతో తనతో పాటు కలసి తిరిగిన నాకూ లక్షణాలు లేకపోయినా పాజిటివ్ వచ్చింది. కోలుకుని ఇంటికి వచ్చాను. క్వారంటైన్ నుంచి వచ్చిన తరువాత రోజూ యోగా చేయడం అలవాటు చేసుకున్నాను అని చెప్పారు. అన్ని జబ్బుల మాదిరే ఇది కూడా ధైర్యంగా ఉండాలని అన్నారు.

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి మాట్లాడుతూ పాజిటివ్ వచ్చినా ఆందోళన చెందలేదన్నారు. మానసిక శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటే అన్ని జబ్బుల మాదిరే కరోనా కూడా వచ్చి పోతుందన్నారు.

మాజీ ఎంపీ వి.హనునుమంతరావుకు 72 ఏళ్లు. అయినా కరోనా వచ్చి కోలుకున్నారు. ఆత్మవిశ్వాసంతో పాటు, పౌష్టికాహారం, వ్యాయామం వంటివి అలవర్చుకుంటే కరోనాని జయించవచ్చని అంటున్నారు.

కాంగ్రెస్ నేత గూడూరు నారాయణరెడ్డి శ్వాసపరమైన అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరి టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది. ఎండలో 20 నిమిషాలు ఉండాలని, నిమ్మకాయలు ఎక్కువగా వాడాలని చెప్పారు. వైద్యులు ఇచ్చిన మందులతో పాటు ఇవి కూడా తీసుకుంటే కరోనా నుంచి బయటపడవచ్చని తెలిపారు. అశ్రద్ధ చేస్తే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా లేకపోలేదు.

Tags

Read MoreRead Less
Next Story