అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి.. బోల్తా కొట్టిందిలే!

అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి.. బోల్తా కొట్టిందిలే!

దేశమంతా కరోనాతో అల్లాడుతుంటే.. అక్కడ మాత్రం నేతలకు రాజకీయాలే పరమావధిగా మారాయి. కుర్చీకోసం కుమ్ములాటలు మొదలయ్యాయి. ప్రజలు ఏమైనా పరవాలేదు పదవులే ముఖ్యమన్నట్టు వ్యవహరిస్తున్నారు నాయకులు. ఒకే పార్టీలో ఉంటూ సీఎం పదవికోసం ఎత్తులకు పైఎత్తులు వేసుకున్నారు. అన్ని గమనిస్తున్న ప్రతిపక్షం అదునుకోసం ఎదురుచూస్తోంది. ఇంతలో పెద్ద షాక్.. అంతా రివర్స్.. ఏమిటా కథ అనుకుంటున్నారా?

రాజస్థాన్ లో కొద్దిరోజులుగా రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి.. కట్ చేస్తే ఆ ఎమ్మెల్యేల వెనుక డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ ఉన్నారన్న విషయం అర్ధమైంది. దాదాపు పాతికమంది ఎమ్మెల్యేలు సచిన్ వెంట ఉన్నారు. బలమైన నాయకుడిగా ముద్రపడిన రాజేష్ పైలట్ కుమారుడే సచిన్.. గడిచిన ఎన్నికల్లో రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సచిన్ పైలట్ తనవంతు సహకారం అందించారు. దాంతో సీఎం పదవి సచిన్ పైలట్ కే దక్కుతుందని అంతా భావించారు.. కానీ అధిష్టానం మాత్రం అశోక్ గెహ్లాట్ ను ఎంపిక చేసింది. ఇటు సచిన్ కు సముచిత స్థానం కల్పించేందుకు రాష్ట్ర పీసీసీ పగ్గాల తోపాటు డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టింది. అయితే ఈ పదవులతో సంతృప్తిగా లేని సచిన్ కు సీఎం కావాలన్న కోరిక కలిగింది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ లో జరిగిన పరిణామాలు ఆయనకు ఆయుధంగా మారాయి. తన వర్గం ఎమ్మెల్యేలుగా ముద్రపడిన వారిని కలుపుకొని ఒక గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు.

అందులో ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు. ఇది తెలుసుకున్న అశోక్ గెహ్లాట్.. సచిన్ వర్గానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదనే ఆరోపణలున్నాయి.. దానికి తోడు మంత్రులకు శాఖల కేటాయింపు కూడా సరిగా చేయలేదని సచిన్ వర్గం కొంతకాలంగా విమర్శలు చేస్తూ వస్తోంది. ఇక పీసీసీ అధ్యక్షుడైన తనను కాదని గెహ్లాట్ తన వర్గానికి చెందిన నేతలకు పార్టీ పదవుల కట్టబెడుతున్నారన్న ఆవేదన సచిన్ లో ఏర్పడింది. ఈ క్రమంలో తనకు 25 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని.. తగిన ప్రాధాన్యత కల్పించాలని అధిష్టానం వద్ద పంచాయితీ పెట్టారు. ఈ పరిణామాలతో ఖంగుతిన్న సీఎం ఆశోక్ గెహ్లాట్ వెంటనే అప్రమత్తమయ్యారు. మూడు రోజుల కిందట పార్టీ కీలక నేతల సమావేశం ఏర్పాటు చేసి.. పరిణామాలపై చర్చించారు. ఇదిలావుండగానే కాంగ్రెస్ లో తిరుగుబాటు ప్రారంభం అయిందని.. అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని ఒకపక్క డిమాండ్ చేస్తోన్న బీజేపీ.. మరోపక్క సచిన్ పైలట్ తో సంప్రదింపులు జరిపినట్టు వార్తలు వచ్చాయి. సచిన్ స్నేహితుడు బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా రంగంలోకి దిగి కాంగ్రెస్ సచిన్ ను వాడుకొని వదిలేస్తోందని వ్యాఖ్యానించారు. దాంతో సచిన్ పైలట్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరతారని రాజకీయ పరిశీలకులు భావించారు. కానీ ఇది జరగలేదు. సోమవారం కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 102 మంది ఎమ్మెల్యేలు వచ్చారు.

అయితే సచిన్ పైలట్ మాత్రం హాజరు కాలేదు.. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో సమావేశం అయ్యారు. అనంతరం అధిష్టానం దూతల తోను భేటీ అయ్యారు. ఈ సందర్బంగా వారితో.. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లేదని.. చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా తనను కొనసాగించడం తోపాటు.. మంత్రివర్గంలో తన వర్గానికి చెందినవారిని మరో ఇద్దరిని తీసుకోవాలని సచిన్ పైలట్ కండిషన్స్ పెట్టారని.. సాయంత్రానికల్లా కాంగ్రెస్ అధిష్టానం కూడా వీటికి ఒకే చెప్పిందని.. సర్కారుకు ఢోకా లేదన్న వార్తలు వచ్చాయి.. అయితే మంగళవారం నిర్వహించిన శాసనసభా పక్ష సమావేశానికి కూడా సచిన్ పైలట్ రాలేదు. దాంతో సీరియస్ అయిన కాంగ్రెస్ అధిష్టానం సచిన్ పైలట్ పై చర్యలకు ఉపక్రమించింది. పీసీసీ అధ్యక్ష పదవి తోపాటు, డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించింది. అలాగే సచిన్ వర్గానికి చెందిన ఇద్దరు మంత్రులకు సైతం క్యాబినెట్ నుంచి ఉధ్వాసన పలికింది. దాంతో సచిన్ పైలట్ తదుపరి కార్యాచరణ ఏంటన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు కరోనా కష్టకాలంలో కూడా ఈ రాజకీయాలు ఏంటని పలువురు పెదవి విరుస్తున్నారు. ఈ సమయంలో ప్రజల ఆరోగ్యంపై దృష్టిపెట్టకుండా కుర్చీకోసం కొట్లాడుకోవడంపై మండిపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story