ఆడపిల్లనైతేనేం.. అమ్మానాన్నలను చంపితే ఊరుకుంటానా.. ఆప్ఘన్ ఉగ్రవాదులపై..

ఆడపిల్లనైతేనేం.. అమ్మానాన్నలను చంపితే ఊరుకుంటానా.. ఆప్ఘన్ ఉగ్రవాదులపై..

తల్లిదండ్రులిద్దరూ ఒకేసారి ఉగ్రవాదుల కాల్పులకు బలైపోయేసరికి ఆ బాలిక కళ్లలో క్రోధాగ్ని జ్వాలలు రగులుకున్నాయి. అంతే ఏకే 47 గన్ తీసుకుని తానూ దాడి చేసింది.. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టింది. ఆఫ్ఘనిస్తాన్ లోని సెంట్రల్ ఘోర్ ప్రావిన్స్ కు చెందిన కమర్ గుల్, ఆమె తమ్ముడు తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నారు. తండ్రి కోసం ఉగ్రవాదులు వెతుకుతున్నారని గ్రామ చీఫ్, స్థానిక పోలీస్ హెడ్ హబీబురాహ్మాన్ హెచ్చరించాడు. కారణం తండ్రి ప్రభుత్వానికి మద్దతుదారుగా ఉండడమే. అది తాలిబన్ ఉగ్రవాదులకు రుచించలేదు. దాంతో అర్థరాత్రి ఇంటిపై దాడికి దిగారు.

నిద్రలో ఉండగా తలుపులు బాదిన సౌండ్ వినపడడంతో బిక్కుబిక్కుమంటూనే అమ్మ తలుపు తీసింది. వారిని చూసి వెంటనే తలుపు వేసినా తోసుకుని లోపలికి వచ్చి ఆమెని అక్కడికక్కడే కాల్చివేశారు. పక్కనే ఉన్న తండ్రిపైనా కాల్పులు జరపడంతో ఒక్కసారిగా ఇద్దరూ కమర్ కళ్లముందే కుప్పకూలిపోయారు. వెంటనే ఒక్కఉదుటన తన దగ్గర ఉన్న ఎకే 47 తుపాకిని ఉగ్రవాదులపైకి ఎక్కుపెట్టింది. ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపేసింది. మిగిలిన ఉగ్రవాదులతో వీరోచిత పోరాటమే చేసింది. ఇంతలో గ్రామస్తులు, ప్రభుత్వ అనుకూల సైనికులు రాగా ఉగ్రవాదులు పరారయ్యారు.

కమర్, ఆమె తమ్ముడు సురక్షితంగా బయటపడ్డారు. కమర్ వయసు 14 నుంచి 16 మధ్య ఉంటుందని అధికారుల అభిప్రాయం. చాలా మంది ఆప్ఘన్లకు వారి ఖచ్చితమైన వయసు తెలియదు. తరువాత అనేకమంది ఉగ్రవాదులు ఆమెపై దాడి చేయడానికి వచ్చారు. కానీ ప్రభుత్వ భద్రతా బలగాలు వారికి రక్షణగా ఉన్నాయి. అక్కా తమ్ముళ్లకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఎప్పటికైనా తప్పదని భావించి వారిని ప్రభుత్వం సురక్షిత ప్రదేశంలో ఉంచింది అని గవర్నర్ ప్రతినిధి మొహమ్మద్ అరేఫ్ అబెర్ తెలిపారు. ప్రభుత్వానికి ఇన్ఫార్మర్లు అని భావించిన గ్రామస్థులను తాలిబన్లు కచ్చితంగా చంపేస్తారు.

ఇటీవలి కాలంలో కాబూల్‌తో ఉగ్రవాదులు శాంతి చర్చలకు అంగీకరించినప్పటికీ దాడులను ముమ్మరం చేశారు. తాలిబన్ ఉగ్రవాదులపై కాల్పులు జరిపి వీరోచితంగా పోరాడిన కమర్ పై నెటిజన్లనుంచి అభినందనలు అందుతున్నాయి. ఆమె ధైర్యానికి హాట్సాఫ్ అని, 'పవర్ ఆఫ్ ఆప్ఘన్' అని మరికొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తల్లిదండ్రులు లేని లోటు తీర్చలేనిది.. కానీ ఆమె పగ తనకి కొంచెం శాంతిని ఇచ్చి ఉంటుంది అని మరికొందరు ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story