రష్యా వ్యాక్సిన్ పై పలు అనుమానాలు..

రష్యా వ్యాక్సిన్ పై పలు అనుమానాలు..

రష్యా టీకా వస్తుందంటే కొంత ఆనందంతో పాటు మరికొంత అనుమానమూ కలుగుతోంది ప్రపంచానికి. నిజానికి వ్యాక్పిన్ కోసం ఎదురు చూస్తున్న ప్రపంచానికి టీకా రాక ఊరటనిచ్చే అంశమే. ఆ టీకా ఏదో త్వరగా వస్తే మామూలు జీవనాన్ని సాగించవచ్చని సంబరపడుతున్నారంతా. ఇంత త్వరగా వస్తున్న స్పుత్నిక్ వీ టీకా తయారీ విధానంపై ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించిన వివరాలు వెల్లడించకుండా టీకాను తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. టీకా సమర్థతకు ఆధారాలేవని అడుగుతున్నారు.

రెండు నెలల కంటే తక్కువ సమయంలోనే ట్రయల్స్ నిర్వహించి టీకాకు అనుమతి ఇవ్వడం ఏంటని భారత్ సహా అనేక దేశాలు రష్యాపై విమర్శలు సంధిస్తున్నాయి. రష్యా ప్రకటన అంత నమ్మదగినదిగా లేదని ప్రముఖ ఇమ్యునాలజిస్టు వినీతా బాల్ అభిప్రాయపడ్డారు. టీకా రోగ నిరోధ శక్తిని పెంచేదిగా ఉండాలి.. అదే సమయంలో ఎలాంటి దుష్పభావాలు ఉండకూడదు అని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ గులేరియా అభిప్రాయపడ్డారు. రష్యా పేరు కోసమే ఇలా చేస్తుందని, మూడో దశ ట్రయల్స్ జరగలేదని.. అమెరికా శాస్త్రవేత్త ఫ్లోరియాన్ క్రామ్మర్ అన్నారు. రష్యా చర్య అత్యంత నిర్లక్ష్యమైనదని జర్మనీ శాస్త్రవేత్త పీటర్ క్రెమ్స్ నలర్ అన్నారు.

రష్యా వ్యాక్సిన్ ను పరిశీలిస్తామని ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రి యులి ఎడైల్ స్టెన్ అన్నారు. టీకా సమర్థతను అంచనా వేసిన తరువాతే వ్యాక్సిన్ కొనుగోలు చేస్తామన్నారు. ఇదిలా ఉండగా తాము తయారు చేసిన టీకా మరో రెండు వారాల్లో దేశ వ్యాప్తంగా అందుబాటులోకి వస్తుందని రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాస్కో వెల్లడించారు. టీకా భద్రతపై వస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు. క్లినికల్ ట్రయల్స్ ను వెల్లడిస్తామని వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన గమాలయా ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ అలెగ్జాండర్ గింట్స్ బర్గ్ తెలిపారు. కాగా రష్యా టీకా గురించి ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారులతో చర్చిస్తున్నామని డబ్ల్యుహెచ్‌వో తెలిపింది. వ్యాక్సిన్ సమర్థతను పూర్తిగా అంచనావేసి వివరాలు వెల్లడిస్తామని సంస్థ అధికార ప్రతినిధి తరీక్‌ జసరేవిక్‌ చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story