అక్కడ దేవతలే వరసిద్ధి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించారట!

Read Time:0 Second

గణనాధుడి నవరాత్రి మహోత్సవాలకు తూర్పుగోదావరి జిల్లా ముస్తాబైంది. జిల్లా అంతటా చవితి పండగను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రసిద్ధిగాంచిన అయినవెల్లి, బిక్కవోలు గణపతి క్షేత్రాలతో పాటు రాజమహేంద్రవరం, కాకినాడ, రామచంద్రాపురం, రంపచోడవరం డివిజన్లలో పెద్ద ఎత్తున గణనాధుడి మండపాలు వెలిశాయి.

కోనసీమలోని మధ్య గౌతమీ, వృద్ధగౌతమీ గోదావరి పాయల సమీపంలో వెలసిన వరసిద్ధి వినాయక క్షేత్రం అయినవిల్లి ఆలయం. ఆంధ్రప్రదేశ్‌లో సుప్రసిద్ధ గణపతి ఆలయాల్లో అయినవిల్లి ఒకటి. ఇది స్వయంభూ గణపతి క్షేత్రం. కాణిపాకం తరువాత అంతటి ప్రాశస్త్యం ఈ ఆలయానికి ఉంది. కృతయుగం నుంచే ఇక్కడ స్వామి కొలువై ఉన్నట్లు స్ధల పురాణం చెబుతోంది. దేవతలే వరసిద్ధి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు భక్తులు విశ్వసిస్తారు. అందుకే అయినవల్లి వరసిద్ధి వినాయక ఆలయంలో పూజలకు ప్రాధాన్యత ఇస్తారు భక్తులు.

కోరిన కోర్కెలు తీర్చే అయినవల్లి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా తొమ్మిది .రోజుల పాటు విశేష పూజలు జరిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని రోజుకో పుష్పాలంకరణతో తీర్చిదిద్దేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే రంగు రంగుల విద్యుత్ దీపాల ఆలంకరణతో అయినవల్లి క్షేత్రం వెలిగిపోతోంది.

అయినవల్లి వరసిద్ధి వినాయకుడ్ని పూజించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలొస్తారు. పెద్ద సంఖ్యలో తరిలొచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు చెబుతున్నారు. కోరిన కోరికెలు తీర్చే కొంగుబంగారంగా ఇక్కడ వరసిద్ది వినాయకుడిని కొలుచుకుంటారు భక్తులు. విఘ్నాలను తొలగించి సకాలంలో పనులు పూర్తయ్యేలా అనుగ్రహించమని పూజిస్తుంటారు.

జిల్లాలో మరో ప్రసిద్ధిగాంచిన గణపయ్య క్షేత్రం బిక్కవోలు. 849-92 మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన తూర్పు చాళుక్య రాజులు ఈ క్షేత్రాన్ని నిర్మించినట్లు స్థలపురాణం చెబుతోంది. నవాబుల పాలనలో ఆలయాలను కూల్చివేయటంతో కాలగర్భంలో ఇక్కడి విగ్రహం కలిసిపోయింది. అయితే..నాలుగైదు దశాబ్దాల క్రితం కొంతమంది భక్తుల కలలోకి వచ్చి విగ్రహం ఉన్న చోటును వివరించి బయటికి తీసి పూజలు చేయాలని చెప్పినట్లు చెబుతారు. అప్పటి నుంచి బిక్కవోలు ఆలయం నిర్మాణం జరిగింది.

ఇక్కడి గణనాథుడి తొండం కుడివైపు తిరిగి ఉండటం ఆలయంలోని విగ్రహ ప్రత్యేకత. అలాగే ప్రతీ యేడు బొజ్జ గణపయ్య విగ్రహం కొద్దిమేర పెరుగుతూ ఉండడం మరో విశిష్టత. మనసులోని కోరికలను బిక్కవోలు వినాయకుడి చెవిలో చెబితే నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ప్రసిద్ధిగాంచిన గణనాథుడి క్షేత్రాల్లో ఒకటిగా కొలుచుకునే బిక్కవోలు ఆలయంలో నవరాత్రి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబుచేశారు. తొమ్మిది రోజుల పండగలో మొదటి రోజున స్థానిక ఎమ్మెల్యే దంపతులచే కలశస్థాపనతో చవితి ఉత్సవాలను ప్రారంభిస్తారు.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published.

Close