జగన్‌ సర్కారు ఎన్ని కుట్రలు చేసినా… పోరాటం ఆపేది లేదు : రైతులు

Read Time:0 Second

వేదిక ఏదైనా నినాదం ఒక్కటే. నిరసన తెలిపే పద్ధతి వేరైనా లక్ష్యం ఒక్కటే. రాజధాని గ్రామాల్లో జై అమరావతి నినాదం మార్మోగుతోంది. 71 రోజులైనా ఉద్యమంలో వేడి తగ్గలేదు. జగన్‌ సర్కారు ఎన్ని కుట్రలు చేసినా… పోరాటం మాత్రం ఆపేది లేదంటున్నారు రైతులు. పోలీసులు ఎక్కడిక్కడ కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నా.. దీక్షలు, ధర్నాలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. రాజధాని ఇక్కడే ఉండాలంటూ అన్నివర్గాలూ ముక్తకంఠంతో నినదిస్తున్నాయి.

అమరావతి ఉద్యమం 71వ రోజూ మహోగ్రంగా సాగింది. మందడం, తుళ్లూరు, వెలగపూడిలో దీక్షాశిబిరాలు జై అమరావతి నినాదంతో దద్దరిల్లాయి…పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, రాయపూడి, నేలపాడు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డులోనూ ఆందోళనలు కొనసాగాయి. సీఎం జగన్ ఇప్పటికైనా మనసు మార్చుకోవాలని లేదంటే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు రైతులు. అమరావతి కోసం ఎన్ని రోజులైనా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

తాడికొండ అడ్డరోడ్డులో నల్ల బెలూన్లతో నిరసన తెలిపారు రైతులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు..రాజధాని భూముల్లో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడంపై భగ్గుమన్నారు. రాష్ట్రం కోసం ఇచ్చిన భూములతో ఆటలాడుతారా అంటూ నిలదీస్తున్నారు. ఇంతవరకు ప్రభుత్వం రైతులతో చర్చలు ఎందుకు జరపడం లేదని ప్రశ్నిస్తున్నారు.

అమరావతి గ్రామాల్లో పర్యటించిన టీడీపీ నేతలు రైతులకు సంఘీభావం తెలిపారు. సీఎం జగన్ తలకిందలుగా తపస్సు చేసినా రాజధాని మారదన్నారు. ప్రజల మధ్య గొడవలు పెట్టేందుకే రాజధానిలో భూపంపిణీ చేస్తున్నారని మండిపడ్డారు. కోర్టు తీర్పు రైతులకే అనుకూలంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు..

రాజధాని రైతుల ఆందోళనలకు రోజురోజుకీ మద్దతు పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో నిరసనలు ఉద్ధృతం అవుతున్నాయి.మిగతా జిల్లాల నుంచి కూడా రైతులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్నారు.. దీక్షా శిబిరాల్ని సందర్శిస్తూ సంఘీభావం తెలుపుతున్నారు.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close