చంద్రబాబును అవమానించేందుకు స్కెచ్‌లు?

ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు ఊహించని పరాభవం ఎదురైంది. జెడ్‌ప్లస్‌ భద్రత ఉన్న ఆయన్ను.. ఎయిర్‌ పోర్టు అధికారులు ఓ సాధరణ వ్యక్తిలా ట్రీట్‌ చేశారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఆయన భద్రతపై అనుమానాలు పెరుగుతున్నాయి.. చంద్రబాబును అవమానించేందుకు స్కెచ్‌లు వేస్తున్నారా? గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఘటన దేనికి సంకేతం. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌ వెళ్లేందుకు విపక్షనేత చంద్రబాబు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లారు. వీఐపీ, జడ్‌ప్లస్‌ భద్రత ఉన్నప్పటికి ఆయన వాహనాన్ని లోపలికి అనుమతించలేదు ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది. మాజీ ముఖ్యమంత్రి వాహనం నేరుగా... వీఐపీ మార్గం నుంచి విమానం వరకు వెళ్లే వెసులుబాటు ఉంది. కానీ ఆ పని చేయలేదు. దీంతో సాధారణ ప్రయాణికుడిలాగే.. విమానాశ్రయంలోకి వెళ్లారు చంద్రబాబు. అయితే అక్కడితో ఆగలేదు ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది! ఏపీకి మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబును ఓ సామాన్యుడిలా ట్రీట్‌ చేశారు. ఆయన్ను ఏకంగా తనిఖీలు చేశారు.

అయితే ఇక్కడ చంద్రబాబు ఎంతో హుందాగా వ్యవహరించారు. ఎయిర్‌పోర్ట్ సిబ్బంది తీరును పట్టించుకోలేదు. పైగా వారికి సహకరించారు. ఆ తర్వాత.. ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌ నుంచి విమానం వరకు సాధారణ ప్రయాణికులతో కలసి విమానం ఎక్కారు. అక్కడనుంచి హైదరాబాద్‌ చేరుకున్నారు. ఇప్పటికే ఏపీలో చంద్రబాబు కాన్వాయ్‌కి పైలెట్‌ క్లియరెన్స్‌ను సైతం‌ తొలగించారు. దీంతో ట్రాఫిక్‌లో చంద్రబాబు వాహనం ఆగితే భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌లోనూ చంద్రబాబును ఓ సామాన్యుడిలా పరిగణించడం వివాదాస్పదమవుతోంది. దీనిపై మండిపడుతున్నారు టీడీపీ నేతలు. వీఐపీ, జెడ్‌ప్లస్‌ భద్రత ఉన్న చంద్రబాబును ఇలా అవమానించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు భద్రతను తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది తీరుపై ఇటు రాష్ట్ర ప్రభుత్వం.. ఇటు పౌర విమానయాన శాఖ అధికారులు ఇంకా స్పందించలేదు.

Tags

Read MoreRead Less
Next Story