అచ్చోసిన ఆంబోతుల్లా వ్యవహరిస్తున్నారు : చంద్రబాబు

అచ్చోసిన ఆంబోతుల్లా వ్యవహరిస్తున్నారు : చంద్రబాబు

టీడీపీ నేతలపై వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఫైరయ్యారు. వరుస కేసుల నేపథ్యంలో పార్టీ లీగల్‌ సెల్‌తో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.. తాజా పరిణామాలపై చర్చించారు.. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని మండిపడ్డారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కుటుంబరావుపై అక్రమ కేసులు బనాయించడాన్ని చంద్రబాబు ఖండించారు. విజయవాడలో కుటుంబరావు బ్రదర్స్‌ భూమికి సంబంధించి 43 ఏళ్ల క్రితం అంశమని అన్నారు. రైల్వే శాఖ భూమి తీసుకుని పరిహారం ఇవ్వకపోతే 1997లో కేసు వేశారని, దీనిపై హైకోర్టు, సుప్రీం కోర్టులు తీర్పులు ఇచ్చాయని గుర్తు చేశారు. ట్రైనింగ్‌ స్కూల్‌ కట్టుకుని కూడా పరిహారం ఇవ్వకుండా 37 ఏళ్లు వాడుకున్న తర్వాత ఆ భూమి అవసరం లేదని రైల్వే శాఖ హైకోర్టుకు తెలిపిందన్నారు. ప్రభుత్వం వద్ద పెట్టిన 23 కోట్లు కూడా వెనక్కు తీసుకుందన్నారు. ఆ తర్వాత రైల్వే అధికారులు కేసు వేసినా 2019లో సుప్రీంకోర్టు స్టేటస్‌ కో ఆర్డర్‌ ఇచ్చిందని చంద్రబాబు చెప్పారు. ప్రస్తుతం స్టేటస్‌ కో ఉన్న అంశంపై లీగల్‌ నోటీసులు ఇవ్వకుండా సదరు భూమిలో హెచ్చరిక బోర్డులు పెట్టి చట్టాలను, నిబంధనలను తుంగలో తొక్కారని చంద్రబాబు మండిపడ్డారు.

రాజకీయ కక్షతోనే ఇలాంటి వేధింపులకు పాల్పడుతున్నారని టీడీపీ అధినేత ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి అంశాన్ని కూడా లీగల్‌ సెల్‌ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది.. 37 ఏళ్ల క్రితం ఆస్తికి సంబంధించిన కేసని.. ఇప్పుడు వేధింపులకు పాల్పడటమేంటని ప్రశ్నించారు. లేని పొలాన్ని ఉన్నట్లు చూపించి, పార్టిషన్స్‌ సృష్టించి అబద్ధపు రికార్డులు తయారు చేసి సోమిరెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అది వారసత్వంతో వచ్చిన ఆస్తి కాదని, స్వార్జితమని అన్నారు. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కూడా ఇంత కక్ష సాధించలేదన్నారు. వైసీపీ నేతలు రాజకీయ కక్షతోనే సోమిరెడ్డిని పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి డాక్యుమెంట్లు చూపమని వేధిస్తున్నారని టీడీపీ అధినేత ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమిరెడ్డి గొంతు నొక్కాలనే ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. లేని సివిల్‌ కేసులను క్రియేట్‌ చేసి.. వాటిని క్రిమినల్‌ కేసులుగా మారుస్తున్నారని ఫైరయ్యారు. ఎప్పుడో ఓబులాపురం గనుల అక్రమ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడిన కేసుల్లో ఇప్పుడు చినరాజప్ప సహా పలువురిపై ఈసికి ఫిర్యాదులు పంపారని చంద్రబాబు అన్నారు. అచ్చెన్నాయుడిపై కేసు పెట్టే సమయానికి తమ ఇంటి పరిసరాల్లో ఆంక్షలు లేవని గుర్తు చేశారు. కానీ, ఆంక్షలు ఉల్లంఘించినట్లు తప్పుడు కేసులు బనాయించారని మండిపడ్డారు. ఒక్క మాట అనని రాజకుమారిపైనా అక్రమ కేసు పెట్టడం వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు పరాకాష్ట అన్నారు చంద్రబాబు.. కానీ, అచ్చోసిన ఆంబోతుల్లా వ్యవహరిస్తున్న వైసీపీ నేతలపై కేసులు లేవని అన్నారు. డీజీపీ అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గి నిస్సహాయంగా మారారని.. మొత్తం పోలీసు వ్యవస్థనే నిస్సహాయంగా మారుస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.. ఇంత పైశాచిక పాలన రాష్ట్ర చరిత్రలో చూడలేదన్నారు.. కేసులు ఉపసంహరించుకునే వరకు తమ పోరాటం ఆగబోదని చంద్రబాబు స్పష్టం చేశారు.

మరోవైపు చలో ఆత్మకూరును భగ్నం చేయడంపైనా టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అచ్చెన్నాయుడు నేతృత్వంలోని 14 మంది సభ్యుల బృందం ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కలిసింది. తమ పార్టీ నేతలపై వైసీపీ దాడులకు పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు. పల్నాడు ప్రాంతంలో చేస్తున్న దౌర్జన్యాలను సవాంగ్‌కు వివరించారు. వైసీపీ అరాచకాలపై ప్రచురించిన రెండు పుస్తకాలను డీజీపీకి అందజేశారు టీడీపీ నేతలు. ప్రభుత్వ వేధింపులు భరించలేకే చలో ఆత్మకూరు నిర్వహించామని టీడీపీ నేతలు చెప్పారు. తమ కార్యకర్తలను వైసీపీ ప్రభుత్వం తీవ్ర వేధింపులకు గురి చేస్తుందని ఆరోపించారు.చలో ఆత్మకూరు పిలుపు ఇచ్చే వరకు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. వైసీపీ పాలనలో బాధితులనే స్టేషన్లో పెట్టే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీ అరాచకాలు, అన్యాయాలపై గవర్నర్‌తోపాటు, హెచ్‌ఆర్సీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌, మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని భావిస్తోంది టీడీపీ. అలాగే ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లనున్నారు.. టీడీపీ ఎంపీలతో వెళ్లి కేంద్రహోంమంత్రికి ఫిర్యాదు చేయాలని యోచిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story