రాజీనామా చేయాలంటూ వారిని బెదిరిస్తున్నారు : చంద్రబాబు

రాజీనామా చేయాలంటూ వారిని బెదిరిస్తున్నారు : చంద్రబాబు

ఏపీ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పు పట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు. విజయవాడలో పార్టీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం నిర్వహించిన చంద్రబాబు.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఘాటుగా స్పందించారు. జగన్-కేసీఆర్‌లు ఆంధ్రాకు అన్యాయం చేసేలా ఆలోచనలు చేస్తున్నారని మండిపడ్డారు. గోదావరి నీటిని తెలంగాణ భూ భాగంలోకి తీసుకెళ్లి.. అక్కడి నుంచి శ్రీశైలానికి తెస్తామనటం అన్యాయమన్నారు. 450 కిలోమీటర్లు నీటిని తీసుకుపోవడం ప్రజల సెంటిమెంట్‌కు సంబంధించిన విషయమన్నారు. ఇది ఇద్దరు ముఖ్యమంత్రులు అనుకుని చేసే కార్యక్రమం కాదని.. ఇద్దరు ముఖ్యమంత్రులు శాశ్వతం కాదని అన్నారు.

రాష్ట్రంలో రాజకీయ దాడులపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక టీడీపీ నేతలపై యధేచ్ఛగా దాడులు జరుగుతున్నాయన్నారు. నెల్లూరులో టీడీపీ నేతల ఇళ్లు కూల్చేస్తున్నారని.. ఇలాంటి అచకాలు ఎప్పుడూ చూడలేదన్నారు. మంచిగా పని చేస్తే నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిద్దాం అనుకున్నామని.. కానీ ప్రభుత్వం విధ్వంసకరంగా పని చేస్తున్నందున పోరాటబాట పట్టక తప్పదన్నారు.

ఏపీలో విచ్చలవిడిగా కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు. ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టి.. కొత్త ఉద్యోగాలు ఇస్తామనడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. రాజీనామా చేయాలంటూ అంగన్‌వాడీ, ఆశా వర్కర్లను బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా జరపాలని సూచించారు.

రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరగడం లేదని చంద్రబాబు విమర్శించారు. ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఆపేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందుల పంచాయతీలు రాష్ట్రంలో చేయనివ్వమని స్పష్టం చేశారు. ప్రజల స్వేచ్ఛను హరించేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వార్థ నిర్ణయాలతో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీయొద్దని సూచించారు. ఇదే పద్ధతి కొనసాగించి ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story