వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే

ఎడతెరిపిలేని భారీ వర్షాలు కర్నూలు జిల్లాను ముంచెత్తాయి. గత ఐదుగురోజులుగా కురిసిన వర్షాలతో జిల్లాలోని వాగులు వంకలు పొంగిపొర్లాయి. చాలా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నంద్యాల డివిజన్‌లోని 17 మండలాల్లో కుండపోతగా వర్షం కురిసింది. నంద్యాల పట్టణంలోని అనేక కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. పై నుంచి వస్తున్న వరదనీరు కుందూనదిలో కలవడంతో ప్రవాహం ఉప్పొంగి జనావాసాలను ముంచెత్తింది. మద్దిలేరు వాగును వరదనీరు ముంచెత్తడంతో సమీపంలోని ఇళ్లు నీట మునిగాయి..

భారీ వర్షాలకు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. 31 వేల హెక్టార్లలో పంట నష్టం సంభవించింది. 2 వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. జిల్లాలో 784 కోట్ల రూపాయల మేర నష్టం జరిగినట్టు ప్రభుత్వం అంచనావేస్తోంది. రోడ్లు కొట్టుకుపోవడంతో ఒక్క ఆర్‌ అండ్‌ బి శాఖకే 4 వందల కోట్లకుపైగా నష్టం జరిగింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే నిర్వహించారు. నంద్యాల, ఆళ్లగడ్డ, మహానందిలోని వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు..

నంద్యాల మున్సిపల్‌ ఆఫీసులో అధికారులతో వరద పరిస్థితిపై జగన్ సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావం, సహాయ చర్యలు, పునరావాసంపై అధికారులతో చర్చించారు సీఎం జగన్‌. పంటనష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు. భవిష్యత్తులో కుందూ నది, నంద్యాల ప్రాంతంలో వరదల వల్ల నష్టం జరగకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామన్నారు. రెగ్యులర్‌గా ఇచ్చే వరద అర్థిక సాయం కంటే ప్రతి ఇంటికీ అదనంగా 2 వేలు ఇవ్వాలని సీఎం సూచించారు. కలెక్టరేట్‌లో ప్రత్యేక సెల్‌ పెట్టాలని కలెక్టర్‌ వీరపాండియన్‌కు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్‌.

Tags

Read MoreRead Less
Next Story