పోలవరం విషయంలో టీడీపీకి బలం..

పోలవరం ప్రాజెక్టులో అవినీతిని వెలికి తీస్తామంటూ ముఖ్యమంత్రి జగన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి నారా లోకేష్. తమ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన 55 వేల 548 కోట్ల రూపాయల సవరించిన అంచనా వ్యయాన్ని కేంద్ర జలవనరుల శాఖ ఆమోదించిన విషయాన్ని ప్రస్తావించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం పంపిన అంచనాలు కేంద్రం ఆమోదిస్తే ఇక అవినీతి ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. అదీకాక.. ఎప్పుడో ఆమోదించిన విషయాన్ని.. తమ గొప్పదనంగా వైసీపీ డబ్బాకొట్టుకోవడం హాస్యాస్పదమన్నారు నారా లోకేష్. అవినీతికి తావులేకుండా కేవలం ప్రజల కోసం చంద్రబాబు అహర్నిశలు పడిన కష్టానికి ప్రతిఫలమే పోలవరం ప్రాజెక్టని అన్నారు. ఇప్పటికైనా బీజేపీ, వైసీపీ నేతలు టీడీపీపై బురదచల్లడం మాని మిగతా 30 శాతం ప్రాజెక్టు పూర్తిచేస్తే మంచిదని ట్వీట్ చేశారు.

పోలవరం విషయంలో వేల కోట్ల అవినీతి జరిగిందని జగన్ అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే చెప్తున్నారు. టెండర్లు, కాంట్రాక్టులు కట్టబెట్టడంలో ఎక్కడ అక్రమాలు జరిగాయో తేల్చాలంటూ నిపుణుల కమిటీని కూడా ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే తాజా పరిణామాలు వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధానికి కారణం అయ్యాయి. సవరించిన ప్రాజెక్టు అంచనాలను కేంద్రం అమోదించడంతో.. TDPకి బలం వచ్చినట్టయ్యింది. తమపై కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తాము చిత్తశుద్ధితో పనిచేశామని చంద్రబాబు, లోకేష్ సహా టీడీపీ నేతలంతా చెప్పుకొస్తున్నారు.

అటు, ఇవాళ పోలవరంపై ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. ఆర్థికశాఖ సంయుక్త కార్యదర్శితో ఏపీ జలవనరుల శాఖ అధికారులు భేటీ అయి.. నిధుల విషయమై చర్చించనున్నారు. సవరించిన అంచనాలకు ఆర్‌ఈసీ ఆమోదంతో.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో వేగం పెరగనుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగుతాయని అధికారులు చెప్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story