నా ఆస్తి పేదలకు దానం చేస్తా.. లేకుంటే బొత్స రాజీనామా చేస్తారా? : చింతమనేని

నా ఆస్తి పేదలకు దానం చేస్తా.. లేకుంటే బొత్స రాజీనామా చేస్తారా? : చింతమనేని

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు. గత నెల 29న పినకడిమిలో దళిత యువకుడిని దూషించి, దాడిచేసిన ఘటనలో చింతమనేని ప్రభాకర్‌పై కేసు నమోదైంది. అప్పటి నుంచి ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే, అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన చింతమనేని, బుధవారం సడెన్‌గా ఇంటి దగ్గర ప్రత్యక్షం అయ్యారు. లొంగిపోతున్నట్లు ముందుగానే ప్రకటించిన చింతమనేని దుగ్గిరాలలోని తన నివాసంలో పోలీసులకు సరెండర్‌ అయ్యారు.

చింతమనేనిని అదుపులోకి తీసుకునే క్రమంలో పెద్ద హైడ్రామా నడిచింది. చింతమనేని ఇంటికి వచ్చారనే విషయం తెలుసుకున్న పోలీసులు పెద్ద సంఖ్యలో ఆయన నివాసాన్ని చుట్టు ముట్టారు. కొందరు పోలీసులు చింతమనేని ఇంట్లోకి వెళ్లి సోదాలు నిర్వహించారు. అప్పటికే పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు, చింతమనేని అనుచరులు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. తీవ్ర ఉద్రిక్తత మధ్య చింతమనేనిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, చింతమనేనికి మధ్య వాగ్వాదం నడిచింది.

తనను అరెస్టు చేసిన తీరుపై చింతమనేని ప్రభాకర్‌ మండిపడ్డారు. తనపై అక్రమ కేసులు పెట్టి పోలీసులు తొత్తుల్లా వ్యవహరిస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. తాను తప్పు చేసినట్టు మంత్రి బొత్సా రుజువు చేస్తే. తన తండ్రి ఆస్తి, తన ఆస్తి పేదలకు దానం చేస్తానని, లేకపోతే మంత్రి పదవికి బొత్స రాజీనామా చేస్తారా? అంటూ సవాల్ విసిరారు.

చింతమనేని అరెస్టు తర్వాత కూడా హైడ్రామా కొనసాగింది. మధ్యాహ్నం 12 గంటలకు చింతమనేని ప్రభాకర్‌ను అరెస్టు చేసిన పోలీసులు మూడు గంటలపాటు తమ వాహనాల్లోనే ఆయన్ను తిప్పారు. సాయంత్రం 4 గంటలకు ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో పరీక్షలు చేయించి కోర్టుకు తరలించారు. అయితే, పినకడిమి కేసుకు సంబంధించి చింతమనేనిని అరెస్టు చేశారని అంతా భావించినా, కోర్టుకు వెళ్లిన తర్వాత సీన్‌ మరో మలుపు తిరిగింది. 2017లో పెదపాడు మండలం అప్పనవీడులో వెంకటరత్నం అనే దళితుణ్ని కిడ్నాప్‌ చేసి వేధించిన కేసులో పోలీసులు ఆయన్ను న్యాయమూర్తి ముందు హాజరుపరచిన విషయాన్ని తెలుసుకుని ఆయన అనుచరులు షాక్‌ తిన్నారు. ఇది రాజకీయ కుట్రగా అభివర్ణించారు చింతమనేని తరపు న్యాయవాది. పోలీసుల దౌర్జన్యంపై ప్రైవేటు కేసు వేస్తామని చెప్పారు.

అయితే, చింతమనేనిపై తొమ్మిది కేసులు నమోదయ్యాయని, అవన్నీ నాన్‌బెయిలబుల్‌ కేసులేనని పోలీసులు చెప్పారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిస్పక్షపాతంగా దర్యాప్తు చేస్తామని జిల్లా ఎస్పీ నవదీప్‌ సింగ్‌ తెలిపారు. తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని.. తాను లొంగిపోతున్నట్టు చింతమనేని ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పోలీసులు చెప్పారు.

ఇక చింతమనేనిని రిమాండ్‌కు తరలించే సమయంలో ఆయన అనుచరులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. పోలీసు కాన్వాయ్‌ వెంటే జిల్లా జైలు వరకు వెళ్లారు.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story