మృతదేహాల కోసం బంధువుల ఎదురుచూపులు

మృతదేహాల కోసం బంధువుల ఎదురుచూపులు

తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరులో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటును వెలికి తీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికి 34 మృతదేహాలు దొరగ్గా.. మిగతా 13 మంది ఏమయ్యారో తెలియడం లేదు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద పరిస్థితి హృదయవిదారకంగా ఉంది. నిద్రాహారాలు మాని తమ వాళ్ల మృతదేహాల కోసం ఎదురు చూస్తున్న బంధువుల్ని ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు. ప్రభుత్వం భరోసా ఇస్తున్నా రోజురోజుకూ ఆశలు సన్నగిల్లుతుండడంతో బంధువులు ఆందోళనలో ఉన్నారు.

పడవను పైకి తీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నదీగర్భంలో ఎంత లోతులో అది ఉందనే దానిపై రకరకాల లెక్కలతో గందరగోళం నెలకొన్నా చివరికి 250 నుంచి 260 అడుగుల లోతులో ఉందని తేల్చారు. 80 మీటర్ల కిందకు వెళ్లి పడవకు తాళ్లు కట్టి పైకి లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టెక్నికల్ అంశాల్ని పరిశీలించుకుంటూనే.. సంప్రదాయ పద్ధతిలోనూ వెలికి తీసేందుకు మార్గాల్ని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఇందుకు కావాల్సిన తాళ్లు, పంట్లు, జేసీబీలు రెడీ చేశారు. రాయల్ వశిష్ట బోట్‌ను బయటకు తీస్తే అందులో ఇరుక్కుపోయిన మిగతా డెడ్‌బాడీల్ని గుర్తించే వీలుంటుంది.

ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొంటున్న నేవీ టీమ్‌కు కూడా నదిలో 150 అడుగుల లోతు వరకూ వెళ్లేందుకే అనుమతి ఉంది. అంతకు మించి కిందకు వెళ్లాలంటే అది ప్రాణాలు రిస్క్‌ చేసి వెళ్లాలి. కాబట్టి గాలంతో బోటు కోసం ప్రయత్నంచడమే మార్గం. ఇన్ని ప్రతికూలతల మధ్య ఆపరేషన్ ఎలాముందుకు వెళ్తుందన్నది అంతుచిక్కడం లేదు. ప్రమాదం జరిగిన రోజుతో పోలిస్తే ప్రస్తుతం నదిలో ప్రవాహ వేగం తగ్గింది. ఐతే.. బురద, ఇసుక మేటల కారణంగా బోటు ఉన్న ప్రాంతానికి చేరుకోవడం కష్టమని ముంబై నుంచి వచ్చిన నిపుణులు కూడా చెప్తున్నారు.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story