ప్రకాశం బ్యారేజ్‌కు పోటెత్తుతున్న వరద

ప్రకాశం బ్యారేజ్‌కు పోటెత్తుతున్న వరద

కృష్ణమ్మ పరుగులు కొనసాగుతున్నాయి.. ఎగువనున్న ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టుల దగ్గర వరద ఉధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ.. దిగువన వున్న జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు అదే ఫ్లో కంటిన్యూ అవుతోంది.. ఆల్మట్టికి ఇన్‌ఫ్లో 5.35 లక్షల క్యూసెక్కులుగా నమోదవుతుండగా.. నారాయణపూర్‌కూ కొంత మేర ఇన్‌ఫ్లో తగ్గింది. నిన్న ఉదయం వరకు జూరాల ప్రాజెక్టుకు 7.2 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా.. ఆ తర్వాత కొద్దికొద్దగా తగ్గుతూ వస్తోంది. ఇదే సమయంలో తుంగభద్ర డ్యామ్‌ నుంచి రెండు లక్షల క్యూసెక్కుల వరద శ్రీశైలానికి పరుగులు పెడుతోంది.

శ్రీశైలం జలాశయానికి ఇన్‌ఫ్లో కొంత మేర తగ్గినట్లే కనబడుతోంది.. నిన్న ఉదయంతో పోల్చితే సాయంత్రానికి వరద ఉధృతి తగ్గింది.. ప్రస్తుతం 8.6 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది.. దీంతో వచ్చిన నీటిని నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు అధికారులు.. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా 25వేల క్యూసెక్కులు, కుడి, ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రాల ద్వారా 70వేల క్యూసెక్కులు, పది గేట్ల ద్వారా నీటిని సాగర్‌కు విడిచిపెడుతున్నారు.

శైలం నుంచి భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో నాగార్జునసాగర్ వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.. ఎగువ నుంచి వరద ఉధృతి కొనసాగుతుండటంతో గేట్ల ద్వారా 4.46 లక్షల క్యూసెక్కుల నీటిని పులిచింతల ప్రాజెక్టుకు వదులుతున్నారు.. నిన్నటి వరకు ముందు జాగ్రత్తగా వచ్చిన నీరు మొత్తం విడచిపెడుతుండగా.. ఎగువన వరద తగ్గుముఖం పట్టడంతో అవుట్‌ ఫ్లోను నియంత్రిస్తున్నారు.. మొన్నటి వరకు 26 గేట్లను 27 అడుగుల మేర ఎత్తగా.. నిన్న 14 అడుగులకు తగ్గించారు. దశాబ్ద కాలం తర్వాత సాగర్‌కు ఈ స్థాయిలో వరద రావటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. అటు సాగర్‌ అందాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు పర్యాటకలు పోటెత్తుతున్నారు.

కృష్ణమ్మ పరుగులతో ప్రకాశం బ్యారేజ్‌కు వరద పోటెత్తుతుంది. పులిచింతల ప్రాజెక్టుకు 5.95 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా.. 3.9 లక్షల క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజ్‌కి వదులుతున్నారు. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో.. ప్రకాశం బ్యారేజ్‌ గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. దాదాపు పదేళ్ల తర్వాత ప్రకాశం బ్యారేజ్‌కు ఇంతలా‌ జలకళ సంతరించుకోవడంతో అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. కృష్ణమ్మ అందాలను తిలకించేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు.. కృష్ణమ్మ గలగలలను చూసి తన్మయత్వం చెందుతున్నారు.. సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story