ఇకపై తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తే ఉద్యమమే : హిందువులు

ఇకపై తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తే ఉద్యమమే : హిందువులు

శ్రీవారి ఆలయానికి సమీపంలోని రాంబగీచా బస్టాండ్ టికెట్ కౌంటర్‌లో జారీ చేసే టికెట్ల వెనుక భాగంలో హజ్, జరూసలేం యాత్రకు సంబంధించిన ప్రకటనలున్నాయి. ఇది గుర్తించిన భక్తులు ఆర్టీసీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఆర్‌ఎం కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన చేపట్టింది. ఆర్టీసీ టిక్కెట్లపై అన్యమత ప్రకటనలేంటంటూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్యమత ప్రచారం జరగకుండా కఠిన చట్టాలు తీసుకురావాలన్నారు.

తిరుమలలో జరిగిన ఈ ఘటనపై ఆర్ఎస్ఎస్, హిందూ సంస్థలు భగ్గుమంటున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కంటే కూడా... కావాలని కొందరు పనిగట్టుకుని చేసినట్టు ఉందని ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా హిందూ సంస్థల ప్రతినిధులు టీటీడీ, ఆర్టీసీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సీఎంగా కాకుండా... మత ప్రచారకుడిగా మారారని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజలు కడుతున్న పన్నులతో జగన్ జెరూసలేం వెళతారా? బీజేపీ ఏపీ విభాగం వెంటనే మేలుకుని దీనిపై స్పందించాలని రతన్ శార్ద అనే కార్యకర్త డిమాండ్ చేశారు. బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, సునీల్ డియోదర్ లకు ట్విట్టర్ ట్యాగ్ చేశారు రతన్.

మఠాధిపతులు, స్వామీజులు సైతం ప్రభుత్వం తీరును తప్పు పట్టారు. కావాలనే అన్యమత ప్రచారాన్ని ప్రోత్సాహిస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే జాతీయ స్థాయిలో భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తున్నారు..

తిరుపతిలో అన్యమత ప్రచారంపై స్పందించారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌. తిరుమలలో టికెట్‌ వెనుక జెరూసలెం గురించి ప్రచారం చేయడం సరికాదన్నారు. ఈ విషయంపై సీఎం జగన్‌కు తెలుసా అని ప్రశ్నించారు. తిరుపతిలో అన్యమత ప్రచారం నేరమని.. తప్పు చేసిన వారిపై జగన్‌ వెంటనే చర్యలు తీసుకోవాలని రాజాసింగ్‌ డిమాండ్‌ చేశారు.

ఇటు రాజకీయ నేతలు, అటు హిందూ సంఘాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో నష్ట నివారణ చర్యలపై అధికారులు దృష్టి సారించారు. మార్చి నెలలో 18 ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఆర్టీసీ యాడ్స్‌ వచ్చాయని ఆర్టీసీ ఈడీ అడ్మిన్‌ కోటేశ్వరరావు తెలిపారు. అనుకోకుండా ఈ పొరపాటు జరిగిందన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడతామన్నారు..

ఆర్టీసీ దీనిపై వివరణ ఇచ్చినా భక్తులు ప్రభుత్వ తీరును తప్పు పడుతూనే ఉన్నారు. పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి చర్యలు కొందరు ప్రోత్సాహిస్తున్నారని.. బలవంతపు మత మార్పిడులు జరగకుండా ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇకపై తిరుమలలో ఇలాంటి పొరపాట్లు జరిగితే హిందువులంతా ఏకమై భారీ ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story