తొలి ప్రసంగంలోనే ప్రతిపక్షాన్ని టార్గెట్‌ చేసిన ముఖ్యమంత్రి

తొలి ప్రసంగంలోనే ప్రతిపక్షాన్ని టార్గెట్‌ చేసిన ముఖ్యమంత్రి

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రెండోరోజు అధికార, ప్రతిపక్షం మధ్య మాటల తూటాలు పేలాయి.. స్పీకర్‌ ఎన్నిక ఎపిసోడ్‌ను ఇరుపక్షాలు వివాదాస్పదంగా మార్చేశాయి.. మొదట అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారామ్‌ను సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రి జగన్‌తోపాటు, అధికార, ప్రతిపక్ష సభ్యులంతా కొత్త స్పీకర్‌కు అభినందనలు తెలిపారు.. ముఖ్యమంత్రి జగన్‌ స్వయంగా తమ్మినేని సీతారామ్‌ను స్పీకర్‌ చైర్‌ వద్దకు తీసుకెళ్లారు.. ఈ సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు సభలో కనిపించలేదు.. అయితే, ప్రతిపక్ష టీడీపీ తరపున అచ్చెన్నాయుడు.. తమ్మినేని వెంట స్పీకర్‌ చైర్‌ వరకు వెళ్లారు.. అనంతరం స్పీకర్‌కు అభినందనలు తెలిపారు.

మొదట ప్రసంగాన్ని మొదలు పెట్టిన ముఖ్యమంత్రి జగన్‌.. స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌కు అభినందనలు తెలిపారు. స్పీకర్‌ను పొగుడూతేనే గత ప్రభుత్వం తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. ఇదే శాసనసభలో విలువల్లేని రాజకీయాలను చూశామన్నారు. ఫిరాయింపులపైనా సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తొలి ప్రసంగంలోనే ప్రతిపక్షాన్ని టార్గెట్‌ చేసి ముఖ్యమంత్రి జగన్‌ చేసిన వ్యాఖ్యలు సభలో కలకలం రేపాయి.. ఆ తర్వాత ప్రతిపక్ష నేత హోదాలో ప్రసంగించిన చంద్రబాబు చాలా సంయమనంతో వ్యవహరించారు.. అయితే, చంద్రబాబు ప్రసంగం ప్రారంభంలో మైక్‌ పనిచేయలేదు. ఈ సందర్భంగా సభలో ఆసక్తికర సంభాషణ జరిగింది.

ఇక్కడి వరకు సభ సజావుగానే నడిచినట్టు కనిపించింది.. ఆ తర్వాత సంప్రదాయాన్ని పాటించలేదని టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు విమర్శించడంతో రచ్చ స్టార్ట్‌ అయింది.. స్పీకర్‌ గురించి మర్యాదపూర్వకంగా మాట్లాడాల్సిన అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకరిపై ఒకరు విమర్శలతో విరుచుకుపడ్డారు.. దీంతో సభ ఆసాంతం విమర్శల పర్వంగానే సాగింది. మరోవైపు పార్టీ ఫిరాయింపులపై మఖ్యమంత్రి జగన్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్‌లో జరిగింది. చంద్రబాబు ప్రతిపక్ష హోదాపైనా జగన్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు.

ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చారు.. అయితే, వైఎస్సార్‌ పేరును ప్రతిపక్ష నేత సభలో ప్రస్తావించడంతో గందరగోళం తలెత్తింది.. చంద్రబాబు ప్రసంగాన్ని అడ్డుకునేందుకు అధికార పార్టీ సభ్యులు ప్రయత్నించారు.ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్‌ కలుగజేసుకుని గతంలో ఎన్టీఆర్‌ ఏమన్నారో చూపించమంటారా అంటూ మాటలతో ఎదురుదాడి చేయడంతో అసెంబ్లీలో చర్చ దారి మళ్లింది.

ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత మిగిలిన సభ్యులు కూడా తమ ప్రసంగాల్లో స్పీకర్‌ గురించి ప్రస్తావిస్తూనే మర్యాదలు, సంప్రదాయాల పేరుతో పరస్పర విమర్శలు చేసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story