ఆ పథకం దేశానికి స్ఫూర్తి : సీఎం జగన్‌

ఆ పథకం దేశానికి స్ఫూర్తి : సీఎం జగన్‌

విభజనతో ఏపీ నష్టపోయిందన్నారు ముఖ్యమంత్రి జగన్‌. ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని మరోసారి గుర్తు చేశారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌కుమార్‌ నేతృత్వంలోని బృందంతో సీఎం జగన్‌, ఉన్నతాధికారులు సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు రాజీవ్‌కుమార్‌కు పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. రంగాల వారీగా రాష్ట్రంలో పరిస్థితులను వారికి వివరించారు. 15వ ఆర్థిక సంఘం, నీతిఆయోగ్‌ ఉదారంగా రాష్ట్రానికి సాయం చేయాల్సిన అవసరాన్ని అధికారులు గుర్తు చేశారు.

కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సాయం, రెవెన్యూ లోటు భర్తీ, పారిశ్రామిక రాయితీలు, కేంద్రం నిధులతో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టుల వ్యవహారంపై సీఎం సహా ఉన్నతాధికారులు నీతి ఆయోగ్‌ బృందానికి వివరించారు. రాష్ట్రానికి సంబంధించి నైపుణ్యాభివృద్ధితో పాటు నిరక్ష్యరాస్యత నిర్మూలనకు కేంద్ర సహకరించాలని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ను జగన్‌ కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల గురించి వారికి వివరించారు. పరిశుభ్రమైన నీటిని ప్రతి ఇంటికీ అందించాలనే లక్ష్యంతో వాటర్‌గ్రిడ్‌ను తీసుకొస్తున్నామని సీఎం చెప్పారు. అమ్మ ఒడికి కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ స్పాన్సర్‌ చేస్తే ఈ పథకం దేశానికి స్ఫూర్తిగా నిలుస్తుందని సీఎం జగన్‌ తెలిపారు.

ఆరోగ్య సమస్యలపై ప్రజలు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని, దీనికోసం ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరిన్ని జబ్బులను చేర్చుతున్నామని సీఎం జగన్‌ చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలన్నింటినీ జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నామని, నాడు-నేడు కింద అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో 10 మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించామని సీఎం జగన్‌ గుర్తు చేశారు. ఇక విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కడపలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని సీఎస్‌ కోరారు. అలాగే వెనుకబడిన జిల్లాలకు కేంద్రం ఇచ్చే సాయం, ఇతర అంశాలను మంత్రుల బృందం నీతి ఆయోగ్‌ దృష్టికి తీసుకెళ్లింది.

ఏపీకి చేయాల్సినంత సాయం చేస్తామని నీతిఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ కుమార్ చెప్పారు. రెవెన్యూలోటు ఆందోళనకరంగా ఉందని, బడ్జెట్‌యేతర ఖర్చులు పెరిగినట్టు కనిపిస్తున్నాయని, పెట్టుబడులు, పబ్లిక్‌ రుణాలపై దృష్టిపెట్టాలని అధికారులకు నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story