ఎట్టకేలకు వైసీపీ బాధితులను పూర్తిగా తరలించిన పోలీసులు

ఎట్టకేలకు వైసీపీ బాధితులను పూర్తిగా తరలించిన పోలీసులు

నిరసనలు నిర్బంధనలు.. అరెస్టులు అందోళనలతో గుంటూరు జిల్లా కోకనూర్‌ దద్దరిల్లింది. ఏపీ రాజధాని ప్రాంతంలో క్షణక్షణం టెన్షన్‌ వాతావరణం కనిపించింది. టీడీపీ చేపట్టిన చలో ఆత్మకూరు ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. మొదట చలో ఆత్మకూరుకు బయల్దేరిన పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌లతో పాటు కీలక నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. టీడీపీ ముఖ్యనేతల ఇళ్ల చుట్టూ మోహరించిన పోలీసులు... టీడీపీ నేతలను లోపలికి వెళ్లనీయలేదు.

జడ్ ఫ్లస్ భద్రత ఉన్న చంద్రబాబు ఇంటికి ఎలా వస్తారని పోలీసులను ప్రశ్నించారు టీడీపీ నేతలు. నిబంధనలను అతిక్రమిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. పోలీసులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అయినా అక్కడి నుంచి కదలని పోలీసులు చంద్రబాబును హౌస్ అరెస్టు చేశారు. గుంటూరు జిల్లాతో పాటు, పల్నాడులో 144 సెక్షన్ విధించారు. ర్యాలీలు, సభలు, సమావేశాలపై నిషేధం విధించారు.

ప్రభుత్వం, పోలీసుల తీరుపై మండిపడ్డారు చంద్రబాబు. ప్రశ్నించే గొంతును నొక్కడం ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు. నిర్బంధంతో ప్రజాస్వామ్యాన్ని కాలరాయలేరని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శాంతి యుత నిరసనలను అడ్డుకోవడం దుర్మార్గమని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇదో చీకటి రోజని అన్నారు.

పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు, ఇతర కీలక నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు పోలీసులు. దీంతో టీడీపీ కార్యకర్తలు ఆందోళనలు ఉధృతం చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోన్న ప్రభుత్వం ఛలో ఆత్మకూరుపై ఉక్కుపాదం మోపింది. విజయవాడ ప్రధాన కూడళ్లల్లో పోలీస్ బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు. చంద్రబాబు నివాసానికి వెళ్లే రహదారులైన బెంజి సర్కిల్, ప్రకాశం బ్యారేజి, కనకదుర్గమ్మ వారధి వద్ద ప్రత్యేక పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తీరుపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుధవారం ఒక్కరోజే 1144 మందిని అరెస్ట్ చేసారు. ప్రభుత్వం ఇప్పటికైనా పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు ‌ మాజీ మంత్రి కళా వెంకటరావు.

అటు గుంటూరులో వైసీపీ ప్రభుత్వ బాధితుల పునరావాసం శిబిరం చుట్టూ పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. టీడీపీ నేతలను అక్కడికి రాకుండా అడ్డుకున్నారు. పోలీసుల తీరుకు నిరసనగా టీడీపీ ఆందోళన చేయడంతో క్షణ క్షణం ఉత్కంఠ పరిస్థితి కనిపించింది. ఎక్కడికక్కడ టీడీపీ నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేసిన పోలీసులు తరువాత బాధితులను సొంతూళ్లకు తరలించే కార్యక్రమం చేపట్టారు. భారీ బందోబస్తు మధ్య స్వగ్రామాలకు తరలించారు.

టీడీపీ పునరావాస కేంద్రం నుంచి 5 బస్సుల్లో వైసీపీ బాధితులను పోలీసులు తరలించారు. వైసీపీ బాధితులను పిడుగురాళ్ల, ఆత్మకూరు, మాచర్ల, గురజాల, దాచేపల్లికి పోలీసులు తరలించారు. శిబిరంలో బాధితుల నుంచి వివరాలు సేకరించిన ఉన్నతాధికారులు ఏ కారణాలతో శిబిరానికి వచ్చారన్న విషయంపై ఆరా తీశారు. బాధితులు అధికారుల ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story