ఏపీ ప్రభుత్వానికి పీపీఏ షాక్

ఏపీ ప్రభుత్వానికి పీపీఏ షాక్

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని పోలవరం అథారిటీ వ్యతిరేకించింది. దీనివల్ల ప్రాజెక్టు నిర్మాణం మరింత ఆలస్యమవుతుందని స్పష్టంగా చెప్పింది. అదే సమయంలో ఖర్చులు కూడా తడిసి మోపెడు అవుతాయని తేల్చి చెప్పింది. అటు.. కేంద్రం కూడా రివర్స్ టెండరింగ్‌ను తప్పు పడుతోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ తన వైఖరి మార్చుకుంటారా... మొండిగా ముందుకెళ్తారా?

రివర్స్‌ టెండరింగ్ పోలవరానికి శాపంగా మారుతుందని ఆ ప్రాజెక్టు అథారిటీ స్పష్టంచేసింది. వ్యయం పెరిగిపోతుందని, నిర్మాణానికి మరింత సమయం అవసరం అవుతుందని అభిప్రాయపడింది. హైదరాబాద్‌లో జరిగిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశానికి జలసంఘం, సాగునీటి శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. పలు అంశాలపై దృష్టి సారించారు. కాంట్రాక్ట్‌ ఎజెన్సీల పనితీరుపై సంతృప్తి వ్యక్తమైంది. రివర్స్ టెండరింగ్‌పై జగన్ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే ముందు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని అథారిటీ సూచించింది.

పోలవరం ప్రాజెక్టు బాలారిష్టాలు దాటుకునేందుకు దశాబ్దాలు పట్టింది. విభజన చట్టంలో తెలిపినట్టు జాతీయ హోదా ప్రకటిచడంతో నిధుల కొరత ఉండదని అంతా అనుకున్నారు. ప్రధానమంత్రి మోదీ కూడా నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడంతో.. గత చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ప్రతి సోమవారాన్ని పోలవారంగా మార్చుకున్న నాటి సీఎం.. ప్రాజెక్టు నిర్మాణాన్ని పట్టాలెక్కించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగా.. ముఖ్యమంత్రి జగన్ రివర్స్ టెండరింగ్ వైపు మొగ్గుచూపారు. పోలవరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నది సీఎం అభిప్రాయం. ఇప్పటికే కాంట్రాక్టు సంస్థ నవయుగకు ప్రీక్లోజర్ నోటీసులు పంపారు. ఈ నేపథ్యంలో రివర్స్ టెండరింగ్‌ను పోలవరం అథారిటీ వ్యతిరేకించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

పోలవరం అథారిటీనే కాదు.. కేంద్ర ప్రభుత్వం కూడా రివర్స్ టెండరింగ్‌కు సానుకూలంగా లేదు. దాని కారణంగా న్యాయపరమైన చిక్కులు వస్తాయని ఒక ఆందోళన. ఫలితంగా ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవుతుంది. అదే సమయంలో వ్యయం భారీగా పెరిగిపోతుంది. కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉండడంతో.. కేంద్రమంత్రుల అభిప్రాయమూ విలువైనదే. మరి, ముఖ్యమంత్రి జగన్‌ ఆలోచన ఎలా ఉండబోతోంది? పాత ప్రభుత్వపు అవినీతిని బయటకు తీస్తామంటూ రివర్స్ టెండరింగ్‌ కే జై కొడతారా..లేక మనసు మార్చుకుంటారా? అనేది చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story