కడప జిల్లాలో చెరువు నిండిందన్న ఆనందం గంటల్లోనే ఆవిరైంది

కడప జిల్లాలో చెరువు నిండిందన్న ఆనందం గంటల్లోనే ఆవిరైంది

ఐదేళ్ల తర్వాత తగినంత వర్షాలు కురిశాయి. భారీ వర్షానికి పెద్ద చెరువు నిండింది. దీంతో కడప జిల్లా రాయచోటి మండలం శిబ్యాల గ్రామస్థులు హ్యపీగా ఫీలయ్యారు. కానీ ఇంతలోనే చెరువుకు గండిపడింది. కళ్లముందే నీరంతా వెళ్లిపోతుంటే రైతుల కంట కన్నీటి ధారలు వచ్చాయి. చెరువుకు గండిపడినట్లు నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులకు గ్రామస్థులు సమాచారం అందించారు. సకాలంలో స్పందిస్తే... చెరువు నీటిని ఆపొచ్చని ఆశపడ్డారు. కానీ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఐదేళ్లుగా నిండని చెరువుకు జల కళ వచ్చిందనుకుంటే... ఇంతలోనే తమ ఆనందం ఆవిరైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సరైన వర్షాలు కురవక శిబ్యాల గ్రామ రైతులు సిటీలు, పట్టణాలకు వలస వెళ్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో పొట్టకూటి కోసం భవన నిర్మాణ కూలీలుగా మారుతున్నారు. శిబ్యాల పెద్ద చెరువు కింద 250 ఎకరాల ఆయకట్టు ఉంది. శిబ్యాల, ఒదివీడు, మట్టి గ్రామ రైతులు ఈ చెరువు నీటితోనే పంటలు పండిస్తారు. ప్రస్తుతం కురిసిన వర్షాలతో పంటలు పండుతాయని రైతులు ఆశించారు. కానీ చెరువుకు గండిపడి నీరంతా వెళ్లిపోవడంతో అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏటా లక్షల రూపాయలు వెచ్చించి మరమ్మతులు చేస్తున్నా... చెరువు గట్టు ఎలా తెగిందని నిలదీస్తున్నారు? నాసిరకం పనులతో సాగు నీరు లేకుండా చేశారని మండిపడుతున్నారు. సమాచారం ఇచ్చినా స్పందించని అధికారులపై సీరియస్‌ యాక్షన్ తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story