మళ్లీ ఘాటెక్కుతోన్న రాయలసీమ నాటు ఉల్లి

మళ్లీ ఘాటెక్కుతోన్న రాయలసీమ నాటు ఉల్లి

రాయలసీమ నాటు ఉల్లి మళ్లీ ఘాటెక్కుతోంది. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలకు ఆయా రాష్ట్రాల్లో ఉల్లి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తెలుగు రాష్ట్రాలకు ఎగుమతులు భారీగా నిలిచిపోయాయి. దీంతో ఇప్పుడు అందరూ కర్నూలు ఉల్లిపై పడ్డారు. ఫలితంగా ఉల్లి ధరలు పై పైకి ఎగబాకుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉల్లికి డిమాండ్‌ పెరగడంతో రైతుల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. ధరలు అంతకంతకు పెరుగుతుండడంతో అటు సామాన్యుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

కర్నూలు జిల్లా ఉల్లి సాగుకి ప్రసిద్ధి. ఏపీలోనే అత్యధికంగా ఉల్లి సాగు ఒక్క కర్నూల్లోనే ఉంటుంది. చూడటానికి ఉల్లి సన్నగా కనిపించినా.. మంచి రుచితో ఘాటు ఎక్కువగా ఉండటం దీని ప్రత్యేకత. అందుకే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పొరుగు రాష్ట్రాల్లోనూ సీమ ఉల్లికి మంచి డిమాండ్‌ ఉంటుంది. దానికి తగ్గట్లు ఎగుమతులు అవుతుంటాయి. కర్నూలు జిల్లాలో మెట్ట ప్రాంతాల్లో కాకుండా కాలువలు, బోరు బావుల కింద రైతాంగం అధికంగా ఉల్లిని సాగు చేస్తుంటారు. కానీ వరుసగా మూడేళ్ల నుంచి తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో కరువు దెబ్బకు ఉల్లి రైతులు నష్టాలను మూట గట్టుకుంటున్నారు.

ఈ ఏడాది కూడా సీజన్‌ వర్షాభావ పరిస్థితులు తప్పలేదు. దశాబ్ధాల చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు అలుముకున్నాయి. వర్షాలు లేక పోవడంతో ఖరీఫ్‌లో సాగు నీటి కాలువలకు నీరు విడుదల కాలేదు. దీంతో అరకొరగా నీటి వసతి ఉన్న బోరు బావుల కింద మాత్రమే ఉల్లిసాగు చేశారు కర్నూలు జిల్లా రైతాంగం. జిల్లాలో ఖరీఫ్-రబీ ఉల్లి సాధారణ సాగు విస్తీర్ణం 21 వేల 145 హెక్టార్లు కాగా.. ఖరీఫ్ లో 13 వేల 235 హెక్టార్లలో ఉల్లిని సాగు చేశారు. ఆశించిన స్థాయిలో వర్షాలు లేక పోయినా.. దిగుబడులు మాత్రం ఆశా జనకంగానే వచ్చాయి. కానీ మార్కెట్ లో ధరలు లేక పోవడంతో రైతులు మొన్నటి వరకు డైలమాలోనే ఉండిపోయారు.

కానీ మహారాష్ట్ర, కర్నాటకలో కురుస్తున్న వర్షాల కారణంగా ఉల్లి పంటలు భారీగా దెబ్బతిని అక్కడి రైతాంగానికి భారీ నష్టాలు వాటిల్లాయి. ఫలితంగా ఉల్లి దిగుబడులు, ఎగుమతులు పడిపోయాయి. దీంతో వ్యాపారులంతా కర్నూలు ఉల్లిపై దృష్టి పెట్టడంతో ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. గతంలో క్వింటాల్‌కు రూ. 600 నుంచి 1400 వరకు ఉన్న ఉల్లి ధర.. ఇప్పుడు ఏకంగా రూ. 4 వేల నుంచి రూ. 5 వేల వరకు పలుకుతోంది.

ఉల్లికి మంచి రేటు వస్తుడటంతో రైతులు సంతోష పడుతుంటే.. పెరిగిన ధరలతో సామాన్యులు నేల చూపులు చూస్తున్నారు. ఇప్పుడు కేజీ ఉల్లికి 50 రూపాయలు పలుకుతుండడంతో వాటిని కొనలేని పరిస్థితి. రానున్న రోజుల్లో ఉల్లి ధరలు మరింత పెరిగి సామాన్యులకు కన్నీళ్లు తెప్పించనున్నాయి.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story