అన్న క్యాంటీన్లు తెరుస్తారా లేదా : టీడీపీ నేతలు

అన్న క్యాంటీన్లు తెరుస్తారా లేదా : టీడీపీ నేతలు

రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్ల మూసివేతకు నిరసనగా టీడీపీ నేతలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోనూ అన్న క్యాంటీన్ల మూసివేతకు నిరసనగా టీడీపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ నేతల నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ కాసేపు తోపులాట జరిగింది. కాల్వశ్రీనివాసుల్ని పోలీసులు అదుపులో తీసుకుని స్టేషన్‌ తీసుకెళుతుండగా కార్యకర్తలు అడ్డుకున్నారు.అరెస్టు చేసిన కాల్వ శ్రీనివాసుల్ని వెంటనే విడుదల చేయాలంటూ టీడీపీ నాయకులు రాయదుర్గం పోలీస్ స్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. టీడీపీ నేతల నినాదాలు ఆందోళనలతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

అన్న క్యాంటీన్లు మూసి పేదల కడుపుకొడుతున్నారని టీడీపీ సీనియర్‌ నేత మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం సెవెన్‌ రోడ్డు జంక్షన్‌లో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి అన్న క్యాంటీన్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు టీడీపీ నేతలు. చవకబారు ఆరోపణలతో సంక్షేమ పథకాలను జగన్‌ ప్రభుత్వం రద్దు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

పేదలకు అన్నంపెట్టే అన్న క్యాంటీన్ల మూసివేతపై తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో టీడీపీ నేతలు ధర్నా నిర్వహించారు. మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే చిన్నరాజప్ప ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. అన్న క్యాంటీన్లు తెరిచి పేదల ఆకలి తీర్చాలని ఆయన డిమాండ్‌ చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. క్యాంటీన్‌ మూసిన రోజు నుంచి దాతల సహకారంతో ఇక్కడ పేదలకు ఉచిత భోజనం అందిస్తున్నారు. ఈ రోజు క్యాంటీన్‌ ఎదుట వంటావార్పు నిర్వహించారు. పేదల కోసం క్యాంటీన్‌లు వెంటనే తెరవాలని నినాదాలు చేశారు.

అన్న క్యాంటీన్ల మళ్లీ తెరవాలని డిమాండ్‌ చేస్తూ కర్నూల్‌ కలెక్టరేట్‌ ఎదుట టీడీపీ నేత టీజీ భరత్‌ నిరసన తెలిపారు. పేదవాడి ఆకలితీర్చే అన్న క్యాంటీన్లు మూసివేయడం మంచి పద్ధతి కాదన్నారు భరత్‌.

తూర్పుగోదావరి జిల్లా తుని టీడీపీ నేతలు పోరుబాటపట్టారు. పేదవాడికి అన్నంపెట్టే అన్న క్యాంటీన్‌ను మూసేయడంపై టీడీపీ నేతలు ధర్నా నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన 3 నెలలకే వైసీపీ ప్రభుత్వం ప్రజలను కష్టాలపాలు చేస్తోందని టీడీపీ నేతలు మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story