ఏపీ రాజధాని మార్పు వార్తలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందన

ఏపీ రాజధాని మార్పు వార్తలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందన

ఏపీ రాజధాని మార్పు ఖాయమా..? అమరావతి చరిత్రలో కలిసిపోవాల్సిందేనా..? ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ఇదే అంశం రచ్చగా మారింది. ముంపు ప్రాంతమైనందున రాజధానికి ఇబ్బందులున్నాయంటూ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు రెండో రోజూ దుమారం రేపాయి. ప్రస్తుతం ఏపీలోని విపక్షాలన్నీ ప్రభుత్వం తీరును తప్పు పడుతున్నాయి.

ఏపీ రాజధానిని మార్చాలని చూస్తే ఆమరణ దీక్షకు కూడా వెనుకాడను అన్నారు మాజీ మంత్రి పత్తిపాటు పుల్లారావు. అమరావతిని రాజధాని కాకుండే చేస్తే మహా ఉద్యమాన్ని చేపడతామన్నారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిని మార్చాలనే వైసీపీ కుట్రను కేంద్ర ప్రభుత్వమే అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిని అమరావతి నుంచి తరలించే కుట్ర జరుగుతోందన్నారు మాజీ మంత్రి నక్కా ఆనంద్‌ బాబు. ప్రభుత్వ నిర్ణయం వెలువడ్డాక పూర్తి స్థాయిలో స్పందిస్తామని తెలిపారాయన. అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉండేలా తాము అమరావతిని ఎన్నుకున్నామన్నారు.

అమరావతి మార్పుపై ఏపీ మంత్రి బొత్స వ్యాఖ్యలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామంటున్నారు ఏపీ బీజేపీ నేతలు. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం 1500 కోట్లు ఇప్పటివరకు ఇచ్చిందన్నారు. రాజధాని మారిస్తే... ప్రభుత్వ ధనమంతా వృథా అవుతుందన్నారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చినట్లు రాజధానిలో భవనాలను కూల్చివేస్తామంటూ చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.

ఏపీ రాజధానిని మారుస్తారన్న విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోదన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి. ఇది కేంద్రం పరిధిలోకి రాదన్నారాయన.

తిరుపతిని ఆంధ్రప్రదేశ్‌ రాజధాని చేయాలని డిమాండ్‌ చేశారు కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్. రాజధానిని దొనకొండకు మార్చడం దాదాపు ఖాయమైందని చెప్పారాయన. కేంద్రంతో సీఎం జగన్ చర్చలు కూడా జరిపారని తెలిపారు. రాజధానికి దొనకొండ అనుకూలంగా ఉండదని.. తిరుపతి కరెక్టుగా ఉంటుందని అన్నారాయన.

ప్రధాన విపక్షం రాజధానిని మారిస్తే ఊరుకునేది లేదంటోంది. 1500 కోట్లు నిధులు ఖర్చు చేశాక ఎలా మారుస్తారంటూ అటు కేంద్రం కూడా నిలదీస్తోంది. ఇటు కాంగ్రెస్‌ సైతం వైసీపీ తీరును తప్పు పడుతోంది. ఇంత రచ్చ జరుగుతున్నా అధికార వైసీపీ మాత్రం ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. రాజధాని మార్పుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకులేదంటూ లీకులకే.. రాజధానిపై రచ్చను ఇంకాస్త పెంచుతోంది.

Tags

Read MoreRead Less
Next Story