సీఎం జగన్ కు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆ వైసీపీ నేతలు

సీఎం జగన్ కు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆ వైసీపీ నేతలు

ఓ వైపు సీఎం జగన్‌.. పారద్శక పాలన అందిస్తామని పదే పదే చెబుతున్నారు. కక్షలకు తావు లేకుండా నీతిమంతమైన పాలన ఇవ్వడమే లక్ష్యమంటున్నారు. అయితే స్థానిక వైసీపీ నేతల తీరు మాత్రం తీవ్ర విమర్శలకు గురి చేస్తోంది. ముఖ్యంగా కొందరు కిందిస్థాయి నేతలు.. రౌడీయిజం చేస్తూ.. ప్రత్యర్థులను భయపెడుతున్నారు..

చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఓ వైసీపీ నేత రెచ్చిపోయాడు. పదుల సంఖ్యలో కిరాయి రౌడీలను తీసుకెళ్లి పంట పొలాలను దున్ని దౌర్జన్యానికి పాల్పడ్డాడు. వైసీపీకి చెందిన ఎంపీపీ భర్త బాలకృష్ణారెడ్డి.. అదే మండలంలోని కోళ్లబైలు పంచాయితీ పరిధి మిట్టమర్రి వాండ్లపల్లికి చెందిన వెంకటరమణ భూములపై కన్నేశాడు. రైతుపై దాడి చేసి పొలంలోకి చొరబడి ట్రాక్టర్లతో దున్నడం ప్రారంభించాడు.

దౌర్జన్యం పొలాన్ని దున్నుతున్నాడనే విషయం గ్రామస్తులకు తెలయడంతో అంతా అక్కడకు చేరుకుని.. అతనిపై తిరగబడ్డారు. బాలకృష్ణారెడ్డి వాహనాన్ని ధ్వంసం చేశారు. రౌడీ మూకలను తరిమికొట్టారు. బాలకృష్ణ ఏర్పాటు చేసిన రౌడీల దాడిలో గాయపడిన రైతు వెంకటరమణ ఆసుపత్రిలో పొందుతున్నాడు.

గుంటూరు జిల్లా కారంపూడిలోనూ కొందరు వైసీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. టీడీపీ నాయకుడు షేక్‌ రషీద్‌కు చెందిన దాబాని వైసీపీ కార్యకర్తలు కూల్చేసి.. రషీద్‌తో పాటు అతని కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో రషీద్, అతని కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. కారంపూడి ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యప్తు చేస్తున్నారు.

ఇటీవల ఓ మహిళను వైసీపీ నేతలు వివస్త్రను చేయడంతో.. ఆమె మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఆ ఘటన తరువాత కూడా కొందరు వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల ఇలాంటి ఘటనలు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే చాలా జిల్లాల్లో టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై దాడులు జరుగుతున్నాయి. దీనిపై ప్రభుత్వ పెద్ద స్పందించి.. ఇలాంటి నేతలను కట్టడి చేయకపోతే రాజకీయ కక్షలు తారాస్థాయికి చేరే ప్రమాదం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story