ఏపీలో ఉద్యమ సెగలు

Read Time:0 Second

ఒకటే ఆశయం…ఒకటే సంకల్పం..! అందరి లక్ష్యం ఒకటే ! ఉద్యమమే ఊపిరిగా అమరావతి కోసం మహోగ్రంగా పోరాటం సాగిస్తున్నారు. ఆందోళనలు ప్రారంభించి ఒకటి కాదు .. రెండు కాదు ఏకంగా 59 రోజులు అయింది. కానీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు ప్రకటన రాలేదు. అయినాసరే రైతులెవరూ ఆత్మస్థైర్యం కోల్పోవడం లేదు. పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తున్నారే తప్ప.. వెనుకడుగు వేయడం లేదు. మందడం, తుళ్లూరులో మహాధర్నాలు, వెలగపూడిలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. ఎర్రబాలెం, రాయపూడి, పెదపరిమి, కృష్ణాయపాలెం సహా మొత్తం 29 గ్రామాల్లోనూ ఉద్యమ సెగలు ప్రజ్వరిల్లుతున్నాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ..అమరావతి కోసం రోడ్కెక్కుతున్నారు.

రాజధాని గ్రామాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా పోరు నినాదమే వినిపిస్తోంది. జై అమరావతి నినాదాలతో మారుమోగుతోంది. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని, సేవ్‌ అమరావతి అంటూ.. మొక్కవోని దీక్షతో పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని అంటున్నారు. అమరావతి సాధన కోసం ఎన్నాళ్లైనా.. ఎందాకైనా పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేస్తున్నారు రైతులు.

సీఎం జగన్‌కు డబ్బు పిచ్చి పట్టిందన్నారు టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమ. తన భూములు అమ్ముకోవడానికే మూడు రాజధానులంటూ కొత్త వాదన తీసుకొచ్చారని ఆరోపించారు.. వెలగపూడిలో రైతుల ఆందోళనకు ఆయన మద్దతు తెలిపారు.

తుళ్లూరులో ఆందోళనలు ఉద్ధృతం అవుతున్నాయి. ఎర్రచెరువు దగ్గర వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేసి.. అక్కడ మానవహారం నిర్వహించారు. రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ.. విజయవాడ ధర్నాచౌక్‌లో సీపీఎం నేతలు 24 గంటల దీక్ష చేపట్టారు. రైతులకు మద్ధతుగా రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు చేస్తామన్నారు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారాయన.

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటున్నారు తిరుపతి ప్రజలు. రాజధాని రైతులు చేస్తోన్న ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అంటూ.. ప్లకార్డులు ప్రదర్శించారు.

అమరావతికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లా కదిరిలో జేఏసీ నేతలు ముస్లింలతో కలిసి దర్గాలో ప్రార్ధనలు చేశారు. సీఎం జగన్‌కు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ వేడుకున్నారు.

0 1
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close