తొమ్మిది సార్లు వేలం పాట పాడితే నాలుగుసార్లు ఆ కుటుంబానికే..

Read Time:0 Second

తనకు మరోసారి తిరుగులేదని నిరూపించింది బాలాపూర్‌ లడ్డూ. ఏడాదికేడాది పెరుగుతూ వస్తున్న లడ్డూ వేలం ధర.. ఈసారి కూడా కొత్త మార్క్‌కు చేరింది. బాలాపూర్‌ గణేషుడి శోభాయాత్ర అనంతరం నిర్వహించిన వేలం పాటలో లడ్డూ రికార్డు స్థాయిలో ధర పలికింది. పోటా పోటీగా సాగిన వేలం పాటలో బాలాపూర్‌కు చెందిన రాంరెడ్డి అనే భక్తుడు 17 లక్షల 60 వేలకు లడ్డూను దక్కించుకున్నాడు. లడ్డూను చేజిక్కించుకునేందుకు 28 మంది పోటీ పడ్డారు. స్థానికులతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు, రాజకీయ నేతలు కూడా వేలంపాటలో పాల్గొన్నారు. చివరకు అధిక ధరకు పాడిన కొలను రాంరెడ్డికే లడ్డూ దక్కింది. గతేడాది కంటే ఈ సారి లక్ష రూపాయలు అధికంగా లడ్డూ ధర పలికింది.

లడ్డూ వేలం పాటను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. నిర్వాహకులు కొలను రాంరెడ్డిని సన్మానించి లడ్డూను అందజేశారు. అనంతరం స్థానిక గణేష్‌ ఆలయంలో పూజలు చేసి ప్రసాదాన్ని ఇంటికి తీసికెళ్లారు. బాలాపూర్‌ లడ్డూ తనకు దక్కడంపై ఆనందం వ్యక్తం చేశారు కొలను రాంరెడ్డి.

గత ఏడాది బాలాపూర్‌ మండలానికి చెందిన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌ గుప్తా 16 లక్షల 60 వేలకు లడ్డూను దక్కించుకున్నారు. 2017లో నాగం తిరుపతి రెడ్డి 15 లక్షల 60 వేలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. ఇక 2016లో 14 లక్షల 65 వేలకు స్కైలాబ్‌రెడ్డి లడ్డూను దక్కించుకోగా.. 2015లో 10 లక్షల 32 వేలకు కళ్లెం మదన్‌మోహన్‌రెడ్డి సొంతం చేసుకున్నారు. 1984 నుంచి బాలాపూర్‌లో గణేష్ ఉత్సవాలు జరుగుతున్నప్పటికీ.. 1994 నుంచే లడ్డూ వేలం ప్రారంభమైంది. 1994లో కొలను మోహన్ రెడ్డి అనే భక్తుడు మొదటి సారిగా 450 రూపాయలకు లడ్డూని సొంతం చేసుకున్నారు. అప్పటి నుంచి ఏటా పోటీ పెరుగుతూ వస్తోంది. వేలం పాట వందల్లోంచి లక్షల్లోకి చేరింది. బాలాపూర్‌ లడ్డూ కొలను కుటుంబానికి సెంటిమెంట్‌గా వస్తోంది. 1994 నుంచి ఇప్పటి వరకు 9 సార్లు వేలం పాట పాడిన కొలను కుటుంబీకులు..మొత్తం నాలుగు సార్లు లడ్డూను దక్కించుకున్నారు. ఈ సారి కూడా అదే కుటుంబానికి చెందిన కొలను రాంరెడ్డి లడ్డూను సొంతం చేసుకోవడం విశేషం.

మొదట లడ్డూ వేలంపాటలో స్థానికులకే అవకాశం కల్పించిన నిర్వాహకులు.. తర్వాత బయటివారిని కూడా అనుమతిస్తున్నారు. అంతేకాదు, లడ్డూ వేలం ద్వారా ఇప్పటి వరకు వచ్చిన ఆదాయాన్నిదేవాలయం, గ్రామాభివృద్ధికి ఉపయోగించారు. పలు స్వచ్చంధ కార్యక్రమాలు కూడా చేపట్టారు. మొత్తంగా ఈసారి కూడా బాలాపూర్‌ వినాయకుడి లడ్డూ ప్రసాదం మరో రికార్డు సృష్టించి అందరి దృష్టిని ఆకర్షించింది.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Leave a Reply

Your email address will not be published.

Close