టీమిండియా కోచ్ రేసులో ఆరుగురు .. మళ్లీ ఆయనకే ఛాన్స్?

బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీమిండియా హెడ్‌ కోచ్‌ ఎంపిక తుది దశకు చేరింది. ఇప్పటికే ఆరుగురితో ఫైనల్‌ జాబితాను సిద్ధం చేసిన కమిటీ…ఈ నెల 16న హెడ్‌ కోచ్‌ పదవి కోసం ఇంటర్వ్యూలు చేపట్టనుంది. మాజీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంత రంగస్వామిలతో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ.. పూర్తి కసరత్తు తరువాత ఆరుగురు పేర్లను ఓకే చేసింది.

ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రితో పాటు టామ్‌ మూడీ, మైక్‌ హెసన్‌, ఫిల్‌ సిమన్స్‌, రాబిన్‌ సింగ్‌, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌లను మాత్రమే ఇంటర్వ్యూలకు పిలవనున్నట్లు తెలుస్తోంది. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలోనే కపిల్‌ కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. అభ్యర్థులకు దీనిపై ఇప్పటికే సమాచారం అందించినట్లు తెలుస్తోంది. అయితే అందరూ నేరుగా ఇంటర్వ్యూల్లో పాల్గొనే అవకాశం లేదు. ముంబైకి రాలేని వాళ్లు స్కైప్‌ ద్వారా కపిల్‌ కమిటీతో మాట్లాడతారు. ప్రెజెంటేషన్‌ ఇస్తారు. ప్రస్తుతం టీమ్‌ఇండియాతో పాటు వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్న రవిశాస్త్రి సైతం అక్కడి నుంచే స్కైప్‌ ద్వారా ఇంటర్వ్యూలో పాల్గొంటాడు. వెస్టిండీస్‌ కాలమానం ఆలస్యంగా ఉంటుంది కాబట్టి ఇంటర్వ్యూకు చివరగా హాజరయ్యేది రవిశాస్త్రే అని తెలుస్తోంది.

రవిశాస్త్రే మళ్లీ కోచ్‌గా కొనసాగాలని కోరుకుంటానని టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం.. అన్షుమన్‌ గైక్వాడ్‌ బహిరంగంగానే రవికి మద్దతు పలకడంతో ప్రస్తుత కోచ్‌నే మళ్లీ ఎంపిక చేస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే కోచ్‌ ఎంపికలో కోహ్లి అభిప్రాయాల్ని కమిటీ పరిగణనలోకి తీసుకోదని… స్వతంత్రంగా వ్యవహరిస్తుందని బీసీసీఐ స్పష్టం చేసింది. హెడ్‌ కోచ్‌ పదవికి ముఖ్యంగా టామ్‌ మూడీ, మైక్‌ హెసన్‌ల నుంచి రవిశాస్త్రికి గట్టి పోటీ ఎదురు కావచ్చని తెలుస్తోంది.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

ఎల్‌ఐసీ కొత్త పాలసీ.. తక్కువ ప్రీమియం ఎక్కువ రక్షణ

Tue Aug 13 , 2019
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (ఎల్‌ఐసీ) కొత్త టర్మ్ పాలసీ జీవన్ అమర్‌ను తీసుకు వచ్చింది. పాలసీదారులకు పూర్తిస్థాయి భద్రత లభిస్తుందని ఎల్‌ఐసీ ఒక ప్రకటనలో తెలిపింది. రెండు రకాల ఆప్షన్స్‌లో పాలసీని అందుబాటులోకి తెచ్చింది. లెవల్ సమ్ అస్యూర్డ్, ఇంక్రీజింగ్ సమ్ అస్యూర్డ్ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. స్మోకర్స్, నాన్ స్మోకర్స్ అని రెండు కేటగిరీలు ఉన్నాయి. 18 నుంచి 64 ఏళ్ల లోపు వయస్సు కలిగిన వారు ఈ పాలసీ […]