జోడి రివ్యూ

జోడి రివ్యూ

టైటిల్‌ : జోడి

నటీనటులు : ఆది సాయి కుమార్‌, శ్రర్ధ శ్రీనాథ్‌, నరేష్‌, వెన్నెల కిశోర్‌, సత్య

సంగీతం : ‘నీవే’ ఫణి కల్యాణ్‌

నిర్మాత : పద్మజ, శ్రీ వెంకటేష్ గుర్రం

దర్శకత్వం : విశ్వనాథ్‌ అరిగెల

ఆది సాయికుమార్ జయాపజయాలతో సంబంధం లేకుండా, కంటెంట్ తో ట్రావెల్ అయ్యే హీరో. అందుకే ఆయన సినిమాలకు మినిమమ్ గ్యారెంటీ అనే ట్యాగ్ లైన్ ఉంటుంది. సౌత్ ఇండియాలో మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న శ్రర్ధా శ్రీనాథ్‌తో జోడి కట్టిన ఆది ఎలాంటి వినోదం అందించాడో చూద్దాం..

కథ:

కపిల్(ఆది) సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంటాడు. అతని తండ్రి కమలాకర్ (నరేష్) బెట్టింగ్‌లలో డబ్బులు పోగొడుతూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుంటాడు. కపిల్.. కాంచన మాల (శ్రర్ధ శ్రీనాథ్) అనే అమ్మాయిని ఇష్టపడతాడు. అతని ఇష్టం ప్రేమగా మారి కాంచనమాల కూడా కపిల్ ని ఇష్టపడుతుంది. వారి ప్రేమ పెద్దల వరకూ చేరే లోపు కపిల్ తండ్రి కమలాకర్ , కాంచన మాల బాబాయి రాజు కి మద్య ఒక వివాదం చోటు చేసుకుంటుంది.

అసలు కాంచనమాల తండ్రి మరణానికి కమాలాకర్ కారణం అనే విషయం తెలుస్తుంది. తన తండ్రి చెడు అలవాట్లకు బలైన ఒక కుటుంబాన్ని ఒప్పించి కపిల్, కాంచనమాల ఒక్కటెలా అవుతారు అనేది మిగిలిన కథ..?

కథనం:

ఏ ప్రేమ కథకు అయినా, వారు ఒకటి అవటానికి ఎదురైన అడ్డంకులు, వాటిని దాటుకునేందుకు వారు చేసే ప్రయత్నాలు వంటి విషయాలు కామన్ గా ఉంటాయి. కానీ ఈ ప్రేమకథను ఒక అందమైన దృశ్యకావ్యంగా మలచేందుకు దర్శకుడు విశ్వనాథ్ చేసిన ప్రయత్నం ప్రతి ఫ్రేమ్ లోనూ కనబడుతుంది. ఇంకా చెప్పాలంటే ఆది, శ్రర్ధ ల మద్య ప్రేమకథ చాలా హృద్యంగా మలిచాడు. ఒకరినొకరు కలుసుకున్నప్పుడు వారి చూపులలో మెరుపులు తొలిప్రేమ లోని మాధుర్యాన్ని గుర్తు చేస్తాయి. యూటర్న్ సినిమాతో సౌత్ సినిమాను ఒక కుదపు కుదిపిన శ్రర్ధ ఈ సినిమాలో చాలా అందంగా కనిపించింది. శ్రర్ద బెస్ట్ లుక్ అనుకోవచ్చు.. శ్రర్ధ బుగ్గలపై ఆది చేసే కామెంట్ కి కనెక్ట్ అవ్వని కుర్రోళ్లు ఉండరనిపించింది.

చెలియా మాటే చందనం అనే పాటకు పిక్చరైజేషన్ బాగుంది. ప్రేమకథ అనగానే కిందా మీద పడిపోయి చూపించే ప్రేమల జోలికి వెళ్ళకుండా కళ్ళతోనూ, నవ్వులతోనూ, ఒకరి గురించి మరొకరు తలుచుకోగానే కనిపించే ఎక్స్‌ప్రెషన్స్ తో కూడా మంచి ప్రేమకథను తీయవచ్చు అని నమ్మి ఆ నమ్మకాన్ని తెరమీద నిలబెట్టాడు దర్శకుడు విశ్వనాథ్. వీరి ప్రేమకథ చెప్పుకోవడానికి సాధారణంగా ఉన్నా, చూడటానికి అందంగా ఉంది. కొత్త సంగీత దర్శకుడు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా ఫీల్ బలంగా కంటిన్యూ చేసింది. ఇక సత్య కామెడీ కొన్ని సన్నివేశాల్లో కితికతలు పెడుతుంది. రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా వచ్చిన వెన్నెల కిషోర్ ని సత్య పంచ్ లో నాక్ అవుట్ చేసే సన్నివేశం హైలెట్ గా ఉంది. వెన్నెల కిషోర్ క్యారెక్టర్ కూడా నవ్వులు పంచింది. ఇక సెంకడాఫ్‌కి వచ్చేసరికి కథనంలో వేగం తగ్గింది. బలమైన సన్నివేశాలకు బదులు కథనం ను నెమ్మదించే సన్నివేశాలే కనిపించాయి.

బెట్టింగ్ కి నాశనం అయ్యే కుటుంబాన్ని ఒక రిఫరెన్స్ గా చూపించి ఫ్యామిలీ డ్రామాను క్రియేట్ చేసిన దర్శకుడి ప్రయత్నం అభినందించ తగ్గదే. సిగరెట్, మందు తాగితే ఆ ఒక్కడితోనే పోతుంది. కానీ బెట్టింగ్ మాయలో పడితే అతనితో పాటు కుటుంబం కూడా నాశనం అవుతుందనే కాన్సెప్ట్ ని మరింత బలంగా చెప్పే వీలున్నా రైటర్‌వేలోనే కథను నడిపించాడు. సెకండాఫ్ లో వీరి ప్రేమకథ ను సైడ్ ట్రాక్ లో పెట్టి, ఫ్యామిలీ ఎమోషన్స్ మీదకు వెళ్లాడు దర్శకుడు. వారి ప్రేమకథకు బాగా కనెక్ట్ అయిన ప్రేక్షకుడు కాస్త నిరాశ పడే విషయం ఇది. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా అంత ఎగ్జైటింగ్ గా లేకపోవడం, దాన్ని హీరో ఎలా పరిష్కరించే విషయం కూడా తేలికగానే అయినట్లు అనిపించింది. ఆది గత చిత్రాలతో పోల్చిన ‘జోడి’ ఖచ్చితంగా బెటర్ కంటెంట్ నే అందించింది. ఆది, శ్రర్ద ల జోడి చేసిన మ్యాజిక్ తెరపై కనిపించింది. ఫణి అందించిన మ్యూజిక్ సినిమాకు ఆయువు పట్టుగామారింది. నరేష్ తన క్యారెక్టర్ కి న్యాయం చేసాడు. గొల్లపుడి పాత్ర హుందాగా సాగింది. రవి ఎడిటింగ్ చాలా షార్ప్‌గా ఉంది. ప్రొడెక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ప్రేక్షకులను పెద్దగా నిరాశపరచకుండా 'జోడి' బాగానే ఆకట్టుకుంటుంది.

చివరిగా:

సాధారణ కథతో ఆకట్టుకున్న అందమైన జోడి..

-కుమార్ శ్రీరామనేని

Tags

Read MoreRead Less
Next Story