మల్లేశం మూవీ రివ్యూ

మల్లేశం మూవీ రివ్యూ

విడుదల తేదీ : జూన్ 21, 2019

నటీనటులు : ప్రియదర్శి, అనన్య, ఝాన్సీ త‌దిత‌రులు.

దర్శకత్వం : రాజ్ ఆర్

నిర్మాత : రాజ్ ఆర్

సంగీతం : మార్క్ కే రాబిన్

సినిమాటోగ్రఫర్ : బాలు యస్

ఎడిటర్ : రాఘవేందర్ వి

అణువణువునా ఉత్తేజం నింపుకున్న మల్లేశం కథ:

గొప్ప విజయాలు వెనకాల గొప్ప ప్రయత్నాలుంటాయి అంటారు.. కానీ ఎడతెగని ప్రయత్నాలుంటాయి..ఆ ప్రయత్నాల విలువ పెళ్ళాం మెడలో పుస్తెల తాడు అవ్వొచ్చు,ఊరంతా అప్పుల అవ్వొచ్చు, పిచ్చోడనే ముద్ర కావొచ్చు. కానీ నమ్మిన విషయంపై నిరంతరం సాధన చేస్తూ, ప్రతి వైఫల్యం నుండి నేర్చుకుంటూ, తన పరిధులను తానే విస్తరించుకుంటూ, కూటికి పేదకానీ, గుణానికి కాదు అనే విషయం ప్రతి సందర్భంలోనూ నిరూపిస్తూ సాగే వ్యక్తి కథ వెండితెర మీద చూడాలంటే మల్లేశం దగ్గరకు వెళ్లాల్సిందే. చింతకింది మల్లేశం కథ.. నిరంతర సాధనతో తన పరిధిని పద్మశ్రీ వరకూ విస్తరించుకున్న ఒక సామాన్యుడి కథ.. వెండితెరకు చేరి ప్రేక్షకుల ముందు నిలిచాడు..? ఈ కథ ఎలాంటి అనుభవాలను ఇచ్చిందో తెలుసుకుందాం..

కథ:

మల్లేశం ( ప్రియదర్శి) అమ్మానాన్నలు చేనేత కార్మికులు. ఇంట్లో మగ్గం ఆఢితే కానీ రోజు గడవని జీవితం వారిది. మగ్గం పై చీరలు నేయాలంటే వాటిని దారాలుగా తీసుకొని ఆసు పోయాలి. ఒక్కో చీరకు సూమారు తొమ్మిది వేలసార్లు దారం చేతిపై తిరగాలి. దీంతో మల్లేశం అమ్మ(ఝాన్సి) కి తరచూ చెయ్యి నెప్పి వస్తుంది. చదువుకునే స్థోమత లేక మల్లేశం కూడా అదే పనిలో పడతాడు. అమ్మ కష్టం తీర్చేందుకు ఏదైనా మిషన్ చేయాలని అతను ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఆ ప్రయత్నాలు ఏవీ సఫలం కావు, దీంతో ఊళ్లో అప్పులు, పిచ్చోడనే ముద్ర కూడా పడుతుంది. తర్వాత పద్మ( అనన్య) తో పెళ్ళి అవుతుంది. కానీ ఆసు పోసేందుకు మిషన్ తయారు చేయాలనే అతని పట్టుదల మాత్రం వదలడు. ఊరిని వదిలి బతకడం కోసం పట్నం వస్తాడు. అక్కడ ఎలక్ట్రిషియన్ గా పనిచేరతాడు. కానీ మిషన్ పై నిరంతరం పని చేస్తుంటాడు. మరి ఆ ప్రయత్నాలు ఎలా ముగిసాయి. అతను తన తల్లి కష్టమే కాదు.. చాలా తల్లుల కష్టాలు ఎలా తీర్చాడు అనేది మిగిలినకథ..

కథనం:

కమెడియన్ గా పరిచయం అయిన ప్రియదర్శి ని కొత్తగా పరిచయం చేసిన సినిమా మల్లేశం. ఎక్కడియినా పాత సినిమా తాలూకు ఛాయలు కనిపిస్తాయేమో అని సినిమా ఎండ్ టైటిల్స్ వరకూ వెతికినా అతను ఎక్కడా దొరకలేదు. తన పాత్ర పరిధులు దాటలేదు. కూడూ, నిద్ర లు మాని తయారు చేసిన ‘ఆసు’ మిషన్ను తండ్రి తగుల బెడుతుంటే ఆ బాధను ప్రేక్షకులకు కలిగించేలా నటించిన దర్శి ఆశ్చర్య పరిచాడు. దోస్త్ లతో ముచ్చట్లు పెడుతున్నప్పుడు, భార్య దగ్గర బాధ పడుతున్నప్పుడు , మిషన్ అంతా రెడీ అయ్యాక అమ్మను పిలిచి ఆన్ చేయించినప్పుడు ప్రియదర్శి నటన చూసి ముచ్చటేసింది. మల్లేశం ను నడిపించింది గెలిపించింది అమ్మ మీద అతనికున్న స్వచ్చమైన ప్రేమ, అండగా నిలబడిన భార్య అందించిన భరోసా. ప్రతి మగాడి విజయం వెనక ఆడది ఉంటుంది అంటారు..కానీ మల్లేశం కు ముందుండి నడిపించడానికి అమ్మ ఉంది, వెనక ఉండి భరసా ఇవ్వడానికి భార్య ఉంది. ప్రతిభ కంటే ఆశయం గొప్పదని, ఆ ఆశయం అమ్మకోసం అయితే అది మరింత గొప్పగా కనపడుతుందని ఈ కథ గుర్తుచేసింది. మల్లేశం భార్య గా కనిపించిన అనన్య ప్రతిభ చాలా ఆశ్చర్య పరిచింది. డెబ్యూ మూవీ లో ఇలాంటి అందమైన నటన తో ఆకట్టుకుంది. ఆ పాత్ర ఆత్మ ను తనలో నింపుకొని తెరమీదకు తెచ్చింది. మల్లేశం ఆశయం తో పాటు మల్లేశం పద్మ ల మద్య ప్రేమకథ అందరినీ ఆకట్టుకుంది. పద్మ పాత్రను దర్శకుడు మలిచిన తీరు అద్భుతం. భర్త ఏదంటే అది అనకుండా ఆ పాత్రను ప్రేమకు, నమ్మకానికి మద్య సంఘర్షణ లో పడవేశాడు. జరుగుతున్నది ఏంటో పెద్దగా తెలియదు, ఏం చేస్తే పరిష్కారం దొరుకుతుందో తెలియదు.. కానీ నవ్వుతూ ‘అవుతదిలే’ అని ఆ అమ్మయి అంటుంటే మల్లేశం కు కష్టం ఏగిరిపోతుంది. తెలియని నమ్మకం కలుగుతుంది. ఆ కళ్ళల్లో కొంటెతనం, అమాయత్వం, నిజాయితీ, ఆత్మ విశ్వాసం అలవోకగా పలికాయి. ఇలాంటి పాత్రకు నిండుదనం తెచ్చిన అనన్య మల్లేశం కథలోనే కాదు, ఇండస్ట్రీలో కూడా చాలా కాలం గుర్తుండిపోతుంది. ఝాన్సీ నటిగా పరిచయం అయి చాలా కాలం అయ్యింది కానీ నటిగా మారడానికి కారణం మాత్రం మల్లేశం సినిమా లో దొరికింది. మల్లేశం తల్లి పాత్ర తో ఝాన్సీ లోని గొప్పనటి వెలుగు చూసింది. ఆ పాత్ర బరువు ను తెలికిగా మోసింది.

ఝాన్సీ కి బలమైన పాత్రలు మోసే శక్తి ఉందని నిరూపించింది. దర్శకుడు సినిమాటిక్ లిబర్టీని తీసుకోవడం కంటే ఆ సన్నివేశాల్లో భావోద్వేగాలను సహాజంగా ప్రేక్షకులకు అందించేందుకే ప్రయత్నించారు. ఎలివేట్ చేయడం, డ్రామా ను పండించడం, వంటి విషయాల జోలికి పెద్దగా పోకుండా కళ్ళముందు జరుగుతున్న సంఘటనలా ప్రతి సన్నివేశాన్ని మలిచారు. కోపం, బాధ, గెలుపు, ఓటమి, ఆనందం, ఆవేదన అన్నీ సహాజంగా తెరమీద తీర్చిదిద్దారు. సినిమాలను ఇలాగే తియాలనే ఫార్ములాలు ఎక్కడా పట్టించుకోలేదు. అదే మల్లేశం ను కొత్తగా ప్రజెంట్ చేసింది. ఆ ప్రయత్నానికి సంగీత దర్శకుడు కె. మార్క్ రాబిన్స్ భుజం కాసారు. దర్శకుడిగా అతని ప్రయత్నం చాలా గొప్పగా అనిపించింది. చైల్డ్ ఎపిసోడ్ ని కొంచెం కుదించినా పర్లేదు. ఇలాంటి చిత్రాలకు అండగా నిలబడ్డ సురేష్ ప్రొడక్షన్స్ కి, మధురా ఎంటర్ టైన్మెంట్స్ కి ప్రత్యేక అభినందనలు.. ఇలాంటి సినిమాలు అందరూ బాగుంది అంటారు కానీ కమర్షియల్ గా వర్క్ అవుట్ కావు, అనే భయాలు వదిలేసి తన నమ్మకం పై తానే పెట్టుబడి పెట్టి, తను ఒక వీడియో లో చింతకింది మల్లేశం స్పీచ్ చూసి ఈ సినిమాని నిర్మించి, దర్శకత్వం వహించిన రాజ్ కి హేట్సాఫ్ చెప్పాల్సందే. కళాత్మక వ్యాపారం నుండి ఫక్తు వ్యాపారం మాత్రమే అయిన సినిమా పరిశ్రమలో ఇలాంటి రాజ్ లు చేసే ప్రయత్నాలు సినిమా పై గౌరవాన్ని పెంచుతాయి. కంచెరపాలెం నుండి కథల వైపు, ఇంకా చెప్పాలంటే నాలుగు ఊళ్లు కు మాత్రమే పరిమితం అయిన తెలుగు సినిమా కథలను మూలాల లోకి తీసుకెళ్తున్న వీరి ప్రయత్నం గొప్పది. అలా అని ఏదో పెద్ద మనసు చేసుకొని రమ్మని మల్లేశం పిలవడం లేదు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఏంగేజ్ చేస్తుంది. అనన్య నవ్వులాగా స్వచ్ఛంగా ఉంది. ప్రియదర్శి నటన లాగా నిజాయితీ గా ఉంది. రాబిన్ అందించిన సంగీతం చాలా బాగుంది. తన బాణీలతో సన్నివేశాల్లోని అనుభూతులన్ని పంచాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. మల్లేశం సినిమా చూసిన ప్రేక్షకుల జ్ఞాపకాల్లో మిగిలిపోతాడు.

చివరాగా:

మల్లేశం అన్నీ ఉండి గెలిచినోడు కాదు.. అన్నీ ఒడ్డి గెలిచినోడు.. తెలుగు లో మంచి చిత్రాల ముచ్చట వచ్చినప్పుడు మల్లేశం తప్పకుండా గుర్తుకువస్తాడు.

-కుమార్

Tags

Read MoreRead Less
Next Story