పేరుకు లెక్చరర్‌.. ఆమె చేసేది..

పేరుకు లెక్చరర్‌.. ఆమె చేసేది..

ఆమె హైదరాబాద్‌లోని ఓ పేరు మోసిన డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌. కానీ బంగారం అక్రమ రవాణాలో ఆరితేరింది. మూడు నెలల కాలంలో ఏకంగా 300 కిలోలకుపైగా బంగారాన్ని దుబాయి నుంచి అక్రమంగా నగరంలోకి తరలించింది. చివరికి డీఆర్‌ఐ అధికారులు చేసిన సోదాల్లో అడ్డంగా దొరికిపోయింది.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో గత మంగళవారం దుబాయి నుంచి వచ్చిన ఒక మహిళ నుంచి 11 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెను ప్రశ్నించినప్పుడు అనేక విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. జియాఉన్నీసా.. భాగ్యనగరంలోని ఓ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌. ఆమెకు బంగారం అక్రమ రవాణాదారులతో పరిచయం ఏర్పడింది. గల్ఫ్‌ దేశాల నుంచి బంగారాన్ని తీసుకొచ్చి నగరంలోని వ్యాపారులకు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. గత ఫిబ్రవరిలో మొదటిసారి బంగారం అక్రమ రవాణా చేసిన ఆమె.. ఎవరికీ అనుమానం రాకపోవడంతో దాన్నే వృత్తిలా ఎంచుకుంది. అయితే పదేపదే గల్ఫ్‌ దేశాలకు వెళ్లి వస్తుండటం, మూడు నెలల కాలంలో 30సార్లకుపైగా బిజినెస్‌ క్లాస్‌లో ఆమె ప్రయాణించినట్లు తేలడంతో అధికారులకు అనుమానం వచ్చింది. గత మంగళవారం దుబాయి నుంచి వచ్చిన ఆమెను తనిఖీ చేయగా 11.1 కిలోల బంగారం, రూ.4.25 లక్షల విలువైన విదేశీ కరెన్సీ దొరికింది.

విచారణలో ఆమె హోటల్‌లో ఉంటున్న విషయం గుర్తించారు. ఆ హోటల్‌లో తనిఖీ చేసి.. మరో 1.5 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు ఆమె 300 కిలోలకుపైగా బంగారం అక్రమ రవాణా చేసినట్లు తేలింది. ఇందుకోసం ఆమె ప్రత్యేకంగా చిన్నచిన్న సంచులు కుట్టించుకుని వాటిల్లో బంగారం బిస్కెట్లు దాచి, అనుమానం రాకుండా లగేజీలో పెట్టేది. హోటల్‌ గదిలో తనిఖీ చేసినప్పుడు బంగారం అమ్మకాలకు సంబంధించి కొన్ని పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎవరెవరికి ఎంత బంగారం సరఫరా చేసింది అందులో ఉంది. వాటిని పరిశీలించి, ఇప్పటివరకు ఆమె ఎంత బంగారం సరఫరా చేసిందో అధికారులు లెక్కగడుతున్నారు. కోర్టు అనుమతితో మరోమారు ఆమెను తమ అదుపులోకి తీసుకొని విచారించాలని భావిస్తున్నారు. ఒక మహిళ ఇంత బంగారం రవాణా చేసినట్లు తేలడంతో అధికారులే విస్తుబోతున్నారు. ఆమె ఎవరి కోసం తెచ్చిందనేది ఆరా తీసి వారిపైనా కేసులు నమోదు చేయబోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story