వైభవంగా జగన్నాథ రథయాత్ర

జగన్నాథ రథచక్రాలు కదిలాయి. జగాలనేలే జగన్నాథుడు అన్నాచెల్లెళ్లతో కలసి అమ్మదగ్గరకు పయనమయ్యాడు. అలిగిన అమ్మవారిని ఊరడించేందుకు యాత్ర చేపట్టాడు. బలభద్రుడు-సుభద్రతో కూడి జగన్నాథ స్వామి పుర వీధుల్లో ప్రయాణం ప్రారంభించాడు. ఒడిషాలోని పూరీ క్షేత్రాన్ని పురుషోత్తమ క్షేత్రమని, శ్రీక్షేత్రమని, శంఖక్షేత్రమని, నీలాచలమని, నీలాద్రి అని, జగన్నాథపురి అనే పేర్లతో పిలుస్తారు. ఇక్కడ శ్రీమహావిష్ణువు జగన్నాథుడిగా పూజలందుకుంటున్నాడు. భగవంతుడు భక్తుల మధ్యకు వచ్చి అత్యంత వైభవంగా జరుపుకొనే మహోత్సవం జగన్నాథుని రథయాత్ర. ఏడాదంతా గర్భాలయంలో ఉండే జగన్నాథుడు ఆషాడ శుద్ధ విదియ నాడు మాత్రం తన సోదరి, సోదరులు సుభద్ర, బలభద్రులతో కలసి రథాలను అధిరోహించి పుర వీధుల్లో విహరిస్తారు. జగన్నాథుని రథయాత్ర ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన రథయాత్ర. బ్రహ్మపురాణం, పద్మపురాణం, స్కందపురాణం, కపిల సంహిత లాంటి ప్రాచీన గ్రంథాల్లో జగన్నాథుని రథయాత్ర ప్రస్తావన ఉంది.

జగన్నాథ రథయాత్ర ఘనంగా ప్రారంభమైంది. ప్రాతఃకాల ధూపదీపాదులు, మంగళ హారతి ముగించి మూల విరాట్ల తరలింపు చేపట్టారు. స్వామి యాత్ర కోసం ఉవ్విళ్లూరుతున్న రథాలు, శ్రీ మందిరం సింహద్వారం ఆవరణకు చేరాయి. వస్త్రాలంకరణ, కలశ స్థాపన, చిత్ర లేఖనం తదితర ఆర్భాటాలతో సిద్ధమైన మూడు రథాల్లో జగన్నాథుడు, బలభ ద్రుడు, సుభద్ర కొలువుదీరారు. అంతకు ముందు పూరీ రాజు సామాన్య సేవకుడిలా చీపురు పట్టి, రథాలను శుభ్రం చేశారు. విగ్రహాలు రథాలపైకి చేరాక భక్తజనఘోష మధ్య రథయాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. స్వామివారి రథయాత్రలో పాల్గొని పునీతులయ్యారు.

జగన్నాథ ఆలయం మౌసిమా మందిరం నుంచి గుండించా ఆలయం వరకు రథయాత్ర జరిగింది. శ్రీమందిరం నుంచి మూలవిరాట్టులు గుండించ మందిరానికి తరలి వెళ్లి అక్కడ బస చేశారు. మళ్లీ తొమ్మిదో రోజున జగన్నాథుడు, సుభద్ర, జలభద్రుల విగ్రహాలను జగన్నాథ ఆలయానికి తీసుకొస్తారు. ప్రపంచంలోని ఏ హిందూ ఆలయంలోనైనా సరే, ఊరేగింపు నిమిత్తం మూలవిరాట్టును కదిలించరు. దీని కోసం ఉత్సవ విగ్రహాలుంటాయి. అలాగే ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం ఆనవాయితీ. అయితే ఈ సంప్రదాయాలన్నింటికీ పూరీ జగన్నాథాలయం మినహాయింపు. బలభద్ర, సుభద్రల సమేత జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. ఊరేగించేందుకు ఏటా కొత్తరథాలను నిర్మిస్తారు. కాబట్టే జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భక్తులు భావిస్తారు.

జగన్నాథుని రథయాత్రను పురస్కరించుకుని ప్రధాన దేవస్థానం శ్రీ మందిరాన్ని పుష్పాలతో అలంకరించారు. రథయాత్ర సమయంలో శ్రీమందిరానికి పుష్పాలంకరణ చేయడం ఇదే తొలిసారి. గుండిచా మందిరం, ఉప ఆలయాలను కూడా పుష్పాలతో తీర్చిదిద్దారు. నిఘా సంస్థల హెచ్చరికలతో 9 రోజుల పాటు రథయాత్ర వేడుకకు 10వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. పూరీకి వచ్చే వాహనాలన్నిటిని భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లను రంగంలోకి దింపారు. ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా ప్రత్యేక నియంత్రణ ఏర్పాటు చేశారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

గ్రామ కార్యదర్శి పోస్టులను భర్తీ చేస్తాం - సీఎం జగన్

Fri Jul 5 , 2019
ఆర్ధిక శాఖపై రివ్యూ చేశారు ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి. 2019-20 బడ్జెట్‌లో ఉండాల్సిన ప్రతిపాదనలపై ప్రధానంగా చర్చించారు. ఈ నెల 11 వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 12 వ తేదీన సీఎం జగన్‌. నేతృత్వంలో ప్రభుత్వం.. తొలిసారి అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. మొత్తం 15 పనిదినాల పాటు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరపాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. బడ్జెట్‌లో నవరత్నాల అమలుకే పెద్ద […]