కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి స్వర్ణ రథం తయారీకి గ్రీన్‌ సిగ్నల్‌

కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి వారి బంగారు రథం తయారీకి దేవాదాయ శాఖ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. రథం తయారీకి 6 కోట్ల రూపాయలతో దేవాదాయ శాఖ మంత్రి ఆమోదం తెలిపారు. దీంతో రథం నిర్మాణ పనులు చకచకా సాగిపోనున్నాయి. స్వామివారి స్వర్ణ రథం పనుల్లో పురోగతి రావడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం కొనసాగుతున్న పాలక మండలి స్వర్ణ రథం పనులపై ప్రత్యేక దృష్టిసారించింది. దాదాపు పదేళ్లుగా నత్తనడకన సాగుతున్న స్వర్ణ రథం నిధుల సమీకరణపై దృష్టిసారించి టీటీడీ సహకారంతో తయారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక ఉత్సవాల్లో.. వివిధ వాహనాల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తుంటారు. 21 రోజులపాటు జరిగే ఉత్సవాల్లో 19 రోజులపాటు విభిన్న వాహనాల్లో ఊరేగుతారు.

ప్రస్తుతం స్వామివారి వాహనసేవల్లో వినియోగిస్తున్న రథాన్ని 1946లో తయారు చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల్లో ఆ రథాన్నే ఉపయోగిస్తున్నారు. ఇక త్వరలో బంగారు రథం నిర్మాణం పూర్తయితే దానిపైనే స్వామివారు దర్శనమివ్వనున్నారు. వచ్చే బ్రహ్మోత్సవాల సమయానికైనా బంగారు రథం తయారీ పూర్తికావాలని భక్తులు కోరుతున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *