12 తలలు, 24 చేతులతో ఖైరతాబాద్‌ శ్రీ ద్వాదశాధిత్య మహా గణపతి

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి అంతా ఇంతా కాదు. చవితి అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్‌ గణేశుడే. ప్రతి ఏడాది ఒక్కో రూపంలో దర్శనమిచ్చే ఇక్కడి గణనాథుడు.. ఈసారి 61 అడుగుల ఎత్తులో శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతిగా దర్శనమిస్తున్నాడు. ఖైరతాబాద్‌ గణపతి తొలిపూజకు భారీ ఏర్పాట్లు చేశారు. వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్‌లో వీధివీధినా ఎన్నో గణపతి విగ్రహాలు ప్రతిష్టిస్తారు. అయితే ఖైరతాబాద్‌ లో ప్రతిష్టించే మహా గణపతి ఒక్క భాగ్యనగరానికే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే చాలా ఫేమస్.

వినాయక చవితి సందర్భంగా మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్ దంపతులు ఖైరతాబాద్ మహాగణపతికి తొలి పూజ చేయనున్నారు. ఖైరతాబాద్ పద్మశాలి సంఘము ఆధ్వర్యం లో 75 అడుగుల జంధ్యం ,75 అడుగుల కండువా సమర్పిస్తారు.

ప్రతి ఏడాది విభిన్న రీతిలో కొలువుదీరుతాడు ఖైరతాబాద్‌ గణపతి. ఈ సంవత్సరం 61 అడుగుల ఎత్తులో ద్వాదశాదిత్య మహా గణపతిగా రూపొందించారు. 12 తలలు, 24 చేతులు, 12 సర్పాలతో గణనాథుడు దర్శనమిస్తున్నాడు. మహాగణపతికి కుడి వైపున పాలసముద్రంలో శయనిస్తున్న విష్ణు, ఏకాదశి దేవి కొలువు దీరారు. అలాగే ఎడమవైపు త్రిమూర్తులతో కూడిన దుర్గాదేవి ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తోంది. ఇక్కడి విగ్రహాలను చూస్తే, సకల దేవతలు ఖైరతాబాద్ లోనే ఉన్నారా అన్న భ్రాంతి కలుగుతుంది.

ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉండడంతో సూర్య భగవానుడిని శాంతింప చేయడం కోసం శ్రీ ద్వాదశాధిత్య మహా గణపతిగా ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెప్పారు. మొత్తం 150 మంది కళాకారులు, 4 నెలలు శ్రమించి ఖైరతాబాద్ మహాగణపతిని తయారు చేశారు. సుమారు కోటి రూపాయలు ఖర్చు అయింది.

కొన్నేళ్లు ఖైరతాబాద్‌ మహాగణపతి లడ్డూ నైవేద్యం తో కూడా అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే నాలుగేళ్ళ క్రితం లడ్డూ పంపిణీలో తొక్కిసలాట జరిగింది. దీంతో మూడేళ్ల నుంచి మహాగణపతి చేతిలో లడ్డు పెట్టడం లేదు. కేవలం బొమ్మ లడ్డు మాత్రమే ఉంటుంది. ఇక అగర్ బత్తి లోను ఖైరతాబాద్ గణేషుడు తన ప్రత్యేకత చాటుకోబోతున్నాడు. అంబికా దర్బార్ బత్తి వారు తయారు చేసిన 25 అడుగుల అగర్ బత్తి 11 రోజుల పాటు నిరంతరాయంగా సువాసనలు వెదజల్లనుంది.

1954 లో ఖైరతాబాద్‌లో ఒక్క అడుగు విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పటి నుంచి ఒక్కో అడుగు పెంచుకుంటూ వస్తున్నారు. 2014 లో 60 అడుగుల ఎత్తులో షష్టి పూర్తి మహోత్సవం కూడా ఘనంగా జరిగింది. ఆ తర్వాత నుంచి ఒక్కో అడుగు తగ్గించుకుంటూ వస్తున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈ యేడు కూడా ఖైరతాబాద్ మహాగణపతిని సెప్టెంబర్ 12 న అనంత చతుర్దశి రోజు మధ్యాహ్నం లోపు నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *