రైతుల అభిమానం.. కలెక్టర్ కన్నీటి పర్యంతం..

రైతుల అభిమానం.. కలెక్టర్ కన్నీటి పర్యంతం..

20 నెలల క్రితం తొలి మహిళా కలెక్టర్‌గా సేలంకు వచ్చారు రోహిణీ బాజీ భగారే. ప్రజలతో మమేకమై ప్రజల అవసరాలను తెలుసుకుని వాటి పరిష్కారానికై చర్యలు చేపట్టేవారు. ముఖ్యంగా రైతులకు సంబంధించిన పలు పథకాలను ప్రకటించి రైతుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. 2017లో కలెక్టర్‌గా విధుల చేపట్టిన మరుక్షణం రైతులతోనే తొలి సమావేశం నిర్వహించారు. రైతులు ఎదుర్కుంటున్న పలు సమస్యలను వినతుల రూపంలో స్వీకరించారు. ఆ వెను వెంటనే వాటి పరిష్కారానికై కృషి చేశారు. ఒక్క రైతుల విషయంలోనే కాదు కలెక్టర్‌గా విధులు నిర్వహించిన 20 నెలల కాలంలో దివ్యాంగులు, విద్యార్ధులు, మహిళలు, శిశువులతో సహా అన్ని వర్గాల వారికి సేవలు అందించి వారి మనస్సుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.

బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు నుంచి ప్రజల మధ్యనే ఉంటూ.. ప్రజల అవసరాలు తెలుసుకుంటూ.. వారి సమస్యలు పరిష్కరించేవారు. ఆమె చేపట్టిన పలు పథకాలు, తీసుకున్న ఆకస్మిక నిర్ణయాలతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఆమె పేరు మార్మ్రోగిపోయింది. కాగా, సేలంతో పాటు నాలుగు జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ ఉత్తర్వులు అందుకున్న కలెక్టర్ రోహిణి మరోసారి రైతులతో సమావేశమయ్యారు. సేలం కుటుంబాలతో మమేకమైన పాత రోజుల్ని గుర్తు తెచ్చుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. తొలి సమావేశం రైతులతోనే.. చివరి సమావేశం కూడా రైతులతోనే జరగడం కాకతాళీయమే అయినా ఆమెకు కన్నీరు తెప్పించింది. అన్నదాతలంతా ఒక్క చోట సమావేశమై ఆమెను శాలువాలతో సత్కరించారు. రైతుల గోడు పట్టించుకుని, సమస్యలను పరిష్కరించిన తల్లివంటూ ప్రశంసలతో ముంచెత్తారు. రోహిణీ కూడా ఓ రైతు బిడ్డే కావడంతో రైతు పడుతున్న బాధ ఆమెకు తెలుసని పలువురు వేనోళ్ల పొగుడుతుంటే ఆమె కళ్ల వెంట ఆనంద భాష్పాలు రాలాయి. రోహిణి స్థానంలో వేలూరు జిల్లా కలెక్టర్ రామన్ సేలంకు బదిలీ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story