భార్యే కాదు భర్త కూడా అవినీతి పరుడే.. తహసీల్దార్‌ లావణ్య భర్త నిర్వాకం

భార్యే కాదు భర్త కూడా అవినీతి పరుడే.. తహసీల్దార్‌ లావణ్య భర్త నిర్వాకం

అమ్మగారు అంతులేని అవినీతికి పాల్పడ్డారు. కోట్లకు కోట్లు కూడబెట్టారు. చివరకు పాపం పండి కటకటాలా పాలయ్యారు. ఇప్పుడు అయ్యగారు కూడా అదే అడ్డదారి తొక్కాడు. ఎందుకో గానీ.. సతి జైలుకు పోయినా పతికి మాత్రం బుద్ధి రాలేదు. అదే గడ్డి బాగుందని నమిలాడు. ఇంకేముంది అతన్ని కూడా భార్య దగ్గరకే పంపించారు ఏసీబీ అధికారులు. రెండు నెలల క్రితం కేశంపేట తహసీల్దార్‌ లావణ్య అవినీతి భాగోతం ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలుసు. ఈ ఘటన మరిచిపోకముందే.. ఇప్పుడు ఆమె భర్త కూడా ఓ నిరుద్యోగి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోవడం మరో సంచలనం రేపుతోంది. కష్ట సుఖాలలోనే కాదు.. అవినీతిలోనూ భాగస్వామ్యం అంటూ నిరూపించింది ఈ అవినీతి జంట.

లావణ్య భర్త వెంకటేశ్వర నాయక్‌ జీహెచ్‌ఎంసీ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి హన్మకొండకు చెందిన రణధీర్‌ అనే వ్యక్తి నుంచి రెండున్నర లక్షల లంచం తీసుకున్నాడు. లంచం సొమ్మును తన బ్యాంకు ఖాతాలో వేయించుకున్నాడు. అంతే కాదు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ కూడా ఉండాలంటే మరో 40 వేలు లంచం డిమాండ్‌ చేశాడు. దీంతో వెంకటేశ్వర నాయక్‌ పదే పదే లంచం ఇవ్వాలని ఫోర్స్‌ చేయడంతో విసుగు చెందిన బాధితుడు రణధీర్‌.. ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఆయన ఇంటికి చేరుకున్నారు ఏసీబీ అధికారులు. రణధీర్‌ నుంచి వెంకటేశ్వర నాయక్ లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు‌. వెంకటేశ్వర నాయక్‌తో పాటు మధ్యవర్తి కందూకురి ప్రకాశ్‌ ని కూడా అదుపులోకి తీసుకున్నారు.

రెండు నెలల క్రితం రంగారెడ్డి జిల్లా కేశంపేట తహసీల్దార్ లావణ్య అవినీతి లీలలు తీవ్ర కలకలం రేపాయి. కొందుర్గు వీఆర్వో అనంతయ్య ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఆయనను విచారిస్తే లావణ్య అవినీతి భాగోతం బయటపడింది. దీంతో హయత్‌నగర్‌లోని లావణ్య ఇంటిపై దాడులు చేసిన ఏసీబీ అధికారులు.. భారీగా ఆస్తులు గుర్తించారు. ఏకంగా 93 లక్షల నగదు, 40 తులాలకుపైగా బంగారం, ఇతర ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో తవ్వే కొద్దీ లావణ్య అక్రమాలు బయటపడ్డాయి. కేశంపేటలో ఏసీబీ అధికారుల విచారణ మొదలెట్టడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకి వచ్చారు. ఇప్పటికే తహశీల్దార్‌ దగ్గర 450 మ్యుటేషన్‌ దరఖాస్తులు ఉన్నట్టు గుర్తించారు. లావణ్య చేసిన రియల్‌ దందా కూడా అంతా ఇంతా కాదు. రెండేళ్ల క్రితం ఉత్తమ తహసీల్దార్‌ అవార్డు అందుకున్న లావణ్య అవినీతి కేసులో అరెస్టు కావడంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది.

భార్య జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉండగానే.. ఇంకా బుద్ధి లేకుండా భర్త కూడా గడ్డి కరవడం చర్చనీయాంశమైంది. భార్యభర్తలిద్దరూ ప్రభుత్వ అధికారులుగా పని చేస్తూ విచ్చల విడిగా అవినీతికి పాల్పడ్డారు. గుట్టల కొద్దీ నగలు, నగదు కట్టలు వెనకేశారు. వెంకటేశ్వరనాయక్‌ లావణ్య భర్తే కావడంతో ఈ కేసును అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. వీరిద్దరికి ఇంకా ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి? ఎంత మంది బాధితులు ఉన్నారు? అన్నది తవ్వి తీసే పనిలో పడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story