పరుగులు పెడుతోన్న పసిడి

పరుగులు పెడుతోన్న పసిడి

భారత మహిళలు, బంగారానిది విడదీయలేని బంధం. తరాలుగా మనవారు పసిడిని ఆభరణాలుగా ధరిస్తూనే ఉన్నారు. అంతేకాదు పసిడిని ఓ ఆస్తిగా కూడబెడుతూ రావడం కూడా ఆచారంగా వస్తోంది. అయితే రోజురోజుకీ పెరుగుతున్న డిమాండ్, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా కొంతకాలంగా బంగారం కొనుగోళ్లు, పెట్టుబడులు కొత్త రూపం సంతరించుకుంటున్నాయి.

అమెరికా - చైనా వాణిజ్య యుద్ధంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు నెమ్మదిస్తున్నాయి. గ్లోబల్ స్టాక్ మార్కెట్లు స్తబ్దుగా ఉన్నాయి. చమురు ధరలు పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్ ఇలా అనేక అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతున్నాయి..అందుకే బంగారం ఉన్నట్టుండి ఒక్కసారిగా వెలిగిపోతోంది. ఎవరూ ఊహించని విధంగా అతి కొద్దికాలంలోనే 35 వేల మార్కును దాటేందుకు దూసుకెళ్తోంది.

గత వారం 34,000 మార్క్ దాటిన 10 గ్రాముల బంగారం ధర ఇప్పుడు 35వేల వైపు పరుగులు తీస్తోంది. మంగళవారం ఒక్కరోజే 200 పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో 99.9 స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర 34 వేల 470 రూపాయలుగా ఉంది. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలతో ప్రపంచ మార్కెట్లో నెలకొన్న అస్థిరత కారణంగా బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు ఇన్వెస్టర్లు. అందుకే కొంతకాలంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆరేళ్ల గరిష్ట స్థాయికి చేరాయి.

జీ-20 శిఖరాగ్ర సమావేశంలో అమెరికా, చైనా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్, జిన్‌పింగ్‌ల మధ్య జరగనున్న వాణిజ్యపరమైన చర్చలపైనా దృష్టి పెట్టారు ఇన్వెస్టర్లు. మరోవైపు ఆర్థిక పరిస్థితులపై పోరాడేందుకు వచ్చే నెలలో ఫెడ్ రేట్లు తగ్గించే ఆలోచనలో ఉంది అమెరికా. ఇలా అనేక అంశాలు బంగారం ధరలు పెరగడానికి కారణమవుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే బంగారం 35 వేల మార్క్ ను దాటేందుకు ఎక్కువ రోజులేం పట్టదు.

Tags

Read MoreRead Less
Next Story