సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన హింసాకాండలో హెడ్ కానిస్టేబుల్ మృతి

Read Time:0 Second

దేశరాజధాని ఢిల్లీలో సీఏఏ సెగలు రగులుతూనేవున్నాయి. ఈశాన్య ఢిల్లీలోని గోకుల్‌పురి ప్రాంతంలో నిరసనలు హద్దులు మీరాయి. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన హింసాకాండలో ఓ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మరణించాడు. ఇరుపక్షాలు రాళ్లు రువ్వుకోవడంతో అక్కడే విధుల్లో నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ తలకు ఒక రాయి బలంగా తాకింది. దీంతో రతన్ లాల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అటు ఈ రాళ్ల దాడిలో డిప్యూటీ కమిషనర్ స్థాయి కలిగిన మరో పోలీసు అధికారి అమిత్ శర్మకు కూడా గాయాలయ్యాయి.

షాహీన్ బాగ్ తరహాలోనే జాఫ్రాబాద్ లోనూ ఆందోళనలు నిర్వహించాలని సీఏఏ వ్యతిరేక వర్గాలు నిర్ణయించాయి. దీంతో రెండు రోజలుగా అక్కడ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. పరిస్థితి తీవ్రంగా మారడంతో ఇప్పటికే జాఫ్రాబాద్ మెట్రో స్టేషన్ ను మూసేశారు. ట్రాఫిక్ పై ఆంక్షలు విధించారు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీఏఏ వ్యతిరేక వర్గాలు నిర్వహిస్తున్న ఈ ఆందోన.. సీఏఏ మద్దతుదారుల్లో అగ్గిని రాజేసింది. దీంతో ఆదివారం నుంచి ఈశాన్య ఢిల్లీలోని జాఫ్రాబాద్, గోకుల్‌పురి, మౌజ్ పూర్, భజన్ పుర తదితర ప్రాంతాలు సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి.

ఇరు వర్గాల మధ్య సవాళ్లు – ప్రతి సవాళ్లు ఘర్షణలకు దారితీశాయి. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. ఈ క్రమంలోనే తలకు రాయి బలంగా తగలడంతో కానిస్టేబుల్ మృతిచెందాడు. అటు, పలు ఇళ్లు, దుకాణాలు, వాహనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. మంటలను అదుపుచేసేందుకు వచ్చిన ఫైరింజన్ ను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీయడంతో పోలీసులు భాష్పవాయువు ప్రయోగం, లాఠీఛార్జీ చేశారు. సమస్యాత్మక ప్రాంతాలలో 144 సెక్షన్ విధించారు. ఆందోళనకారులపై నిషేధాజ్ఞలు జారీచేశారు.

ఢిల్లీలో జరుగుతున్న సీఏఏ ఘర్షణలపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ విచారం వ్యక్తం చేశారు. దిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో శాంతి, సామరస్యాలకు భంగం కలిగించే వార్తలు రావడం తనను బాధిస్తున్నాయని తెలిపారు. తక్షణమే శాంతి, భద్రతలు పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు, కేంద్ర హోంమంత్రికి కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీలో శాంతిభద్రతలను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ దిల్లీ పోలీస్‌ కమిషనర్‌ను ఆదేశించారు. పరిస్థితిని సునిశితంగా సమీక్షిస్తున్నట్టు చెప్పారు. శాంతి, సామరస్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సంయమనంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.

హింసాత్మక ఘటనల విషయంలో ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని బాబర్‌పూర్‌ ఎమ్మెల్యే గోపాల్‌ రాయ్‌ విజ్ఞప్తి చేశారు. కొందరు వ్యక్తులు ఢిల్లీలో శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు మరింత మంది పోలీసులను మోహరించేలా చర్యలు తీసుకుంటామని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ హామీ ఇచ్చారంటూ ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేశారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో పర్యటిస్తున్న సమయంలోనే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో.. ప్రభుత్వ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ట్రంప్ ఆగ్రా పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకునే కొద్ది గంటల ముందు.. ఘర్షణలు ఉధృతం కావడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

0 0
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleppy
Sleppy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Close