సేమ్ సీన్ రిపీట్.. అప్పట్లో అమిత్ షా.. ఇప్పుడు చిదంబరం

సేమ్ సీన్ రిపీట్.. అప్పట్లో అమిత్ షా.. ఇప్పుడు చిదంబరం

సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. అప్పట్లో అమిత్ షా.. ఇప్పుడు చిదంబరం. పేర్లు మాత్రమే వేరు.. మిగతాదంతా సేమ్ టు సేమ్. తొమ్మిదేళ్ల క్రితం తన అరెస్ట్ కు ప్రతిగానే ఇప్పుడు చిదంబరం అరెస్ట్ జరిగిందా..? రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇవే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పొలిటికల్ పిక్చర్ లో అన్ని సాధ్యమే. ఆసక్తికర ట్విస్టులు, పగతీర్చుకునే ఉద్రిక్త సన్నివేశాలు, పతనం శాసించే ఘట్టాలకు కొదువ ఉండదు. అధికారంలో ఎవరు ఉంటే వాళ్లే రింగ్ మాస్టర్. ఆడించినట్టు ఆడాల్సి అవసరం వస్తుంది. గతంలో కేంద్ర హోంమంత్రిగా పవర్ పాలిటిక్స్ తనదైన వేలో నడిపించిన చిదంబరం.. తాను సంధించిన సీబీఐ ఆస్త్రం రివర్స్‌ అయి ఇప్పుడు తననే బందీని చేసింది. అప్పట్లో అమిత్ షా మీదకు సీబీఐని ఉసిగొల్పగా.. ఇప్పుడు కేసుల రూపంలో అది చిదంబరం మెడకే చుట్టుకుంది.

INX ముడుపుల కేసులో ఇంద్రాణి ముఖర్జీ అప్రూవర్ గా మారినప్పుడే చిదంబరం భవిష్యత్తు డిసైడ్ అయ్యింది. అంతలా చిదంబరాన్ని కేంద్రం టార్గెట్ చేయటం వెనక అమిత్ షా రీవేంజ్ ఉందనే ఆరోపణలు ఉన్నాయి. తొమ్మిదేళ్ల క్రితం కేంద్ర హోం మంత్రిగా ఉన్న చిదంబరం.. గుజరాత్ హోంమంత్రిగా ఉన్న అమిత్ షాను అరెస్ట్ చేయించారు. అదే కసితో చిదంబరాన్ని కూడా అరెస్ట్ చేయించారనే ప్రచారం జరుగుతోంది.

యూపీఏ అధికారంలో ఉన్న పదేళ్లపాటు చిదంబరం ఓ వెలుగు వెలిగారు. హోం మంత్రిగా, ఆర్థిక మంత్రిగా కీలక బాధ్యతలను నిర్వర్తించారు. 2005లో అప్పటి గుజరాత్ మంత్రి, ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్ షాను సోహ్రాబుద్దీన్ షేక్ ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు విచారించారు. అప్పుడు గుజరాత్ హోం మంత్రిగా ఉన్న అమిత్ షా అనుమతితోనే సోహ్రాబుద్దీన్‌ను ఎన్‌కౌంటర్ చేశారని ఆరోపణలు వచ్చాయి. సుప్రీం ఆదేశాలతో ఈ కేసును 2010 జనవరిలో సీబీఐకి బదిలీ చేశారు. ఆరు నెలల తర్వాత.. అంటే జూలై 2010లో సోహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో సీబీఐ అమిత్ షాను అరెస్ట్ చేసింది. అప్పట్లో చిదంబరం కేంద్ర హోం మంత్రిగా ఉన్నారు. కేంద్ర హోంమంత్రిగా చిదంబరం అమిత్ షాను ఊపిరిసలపకుండా కేసులతో ఉక్కిరిబిక్కిరి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కోర్టు బెయిల్ మంజూరు చేసినా.. ఆ మరుసటి రోజే పిటీషన్ వేయించి ఏకంగా రెండేళ్ల పాటు అమిత్ షాను గుజరాత్ లో అడుగు పెట్టకుండా చేశారు చిదంబరం.

తొమ్మిదేళ్ల తర్వాత సీన్ రివర్స్ అయ్యింది. కేసుల మీద కేసులతో అమిత్‌షా వెంటపడి ఆయన్ను జైలుకు పంపించిన చిదంబరం ఇప్పుడు కటకటాల పాలయ్యారు. కాకతాళీయమో, కక్షసాధింపోగానీ.. ఆనాడు అరెస్టైన అమిత్ ఇప్పుడు కేంద్రహోంమత్రిగా ఉన్నారు. అప్పట్లో కేంద్ర హోంమంత్రిగా ఉన్న చిదంబరం ఇప్పుడు అరెస్ట్ అయ్యారు. అలాగే బెయిల్ విషయంలో ఈ ఇద్దరికి పొంతన ఉంది. ఇప్పుడు చిదంబరానికి ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ కోరినట్టుగానే.. అప్పట్లో అమిత్ షాకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ గుజరాత్ హైకోర్టును కోరింది. కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తమపై కేసు పెట్టారని కాంగ్రెస్ వాదిస్తున్నట్లుగానే అప్పట్లో అమిత్ షా కూడా తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story