మాయావతికి సొంత పార్టీ ఎమ్మెల్యేల షాక్‌

మాయావతికి సొంత పార్టీ ఎమ్మెల్యేల షాక్‌

బీఎస్పీ అధినేత్రి మాయావతికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలే మాయావతికి షాక్ ఇచ్చారు. రాజస్థాన్‌లో బీఎస్పీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. బీఎస్పీ లెజిస్లేచర్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. రాజేంద్ర గౌడ సింగ్ అవానా, వాజిబ్ అలీ, లఖన్ సింగ్ మీనా, సందీప్ యాదవ్, దీప్‌చంద్ ఖేరియాలు బీఎస్పీ నుంచి కాంగ్రెస్‌ పార్టీలోకి జంపయ్యారు. ఈ మేరకు రాజస్థాన్ స్పీకర్‌ను కలసి లేఖ అందచేశారు. దీంతో రాజస్థాన్‌ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ లభించినట్లైంది.

రాజస్థాన్‌ అసెంబ్లీలో మొత్తం 200 స్థానాలున్నాయి. అయితే, ఇప్పుడు అసెంబ్లీలో మొత్తం 198 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 సీట్లు సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలం లేకపోవడంతో బీఎస్పీ సహా మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఐతే, ఆపరేషన్ కమల్ నేపథ్యంలో సర్కారు మనుగడపై అనిశ్చితి ఏర్పడింది. కర్ణాటక పరిణామాలను పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్ నాయకత్వం, చురుగ్గా పావులు కదిపింది. బీఎస్పీ ఎమ్మెల్యేలకు గాలం వేసి తమ వైపునకు తిప్పుకుంది. తాజాగా ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. దాంతో హస్తం బలం 106కు పెరిగింది.

అటు బీఎస్పీ ఎమ్మెల్యేల జంపింగ్‌పై మాయావతి తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మోసానికి పాల్పడిందని ఘాటుగా విమర్శించారు. అంబేద్కర్ సిద్ధాంతాలను కాలరాయడం కాంగ్రెస్ నాయకత్వానికి వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్థులపై పోరాడే బదులు, మద్దతుగా నిలిచే వారిని వెన్నుపోటు పొడుస్తున్నారని దుయ్యబట్టారు. అయితే, బీఎస్పీ ఎమ్మెల్యేలు మాత్రం రాష్ట్రాభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరామని సమర్ధించుకున్నారు.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story